James Anderson: వైజాగ్ టెస్టులో నేడు జో రూట్ బ్యాటింగ్ చేస్తాడా? లేదా? అనే సందేహాలపై క్లారిటీ ఇచ్చిన జేమ్స్ ఆండర్సన్
- జాగ్రత్తలు తీసుకోవడంతో రూట్ బ్యాటింగ్ చేస్తాడన్న ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్
- గాయం మరీ అంత తీవ్రమైనది కాదని వెల్లడి
- చిటికెన వేలుకి గాయమవ్వడంతో ఆదివారం మైదానాన్ని వీడిన జో రూట్
భారత్, ఇంగ్లండ్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆట ఇంకా రెండు రోజులు మిగిలివుండగా పర్యాటక జట్టు గెలవాలంటే 332 పరుగులు సాధించాల్సి ఉంది. ఇక టీమిండియా గెలుపునకు 9 వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. దీంతో నాలుగవ రోజు (నేడు) ఆట అత్యంత కీలకంగా మారింది. దీంతో చిటికెన వేలుకి గాయమవ్వడంతో ఆదివారం మైదానాన్ని వీడిన ఇంగ్లండ్ కీలక బ్యాట్స్‌మెన్ నేడు బ్యాటింగ్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సందేహాలపై ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
జాగ్రత్తలు తీసుకుంటుండడంతో జో రూట్ బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయని వెల్లడించాడు. గాయం మరీ అంత తీవ్రమైనది కాదని తెలిపాడు. ఆదివారం ఆట ఉదయం సెషన్‌లో గాయమవ్వడంతో మైదానాన్ని వీడాడని, బ్యాటింగ్ చేసేటప్పుడు అది ఎంత తీవ్రమైనదో తెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. నాలుగవ రోజు ఆటలో జో రూట్ బ్యాటింగ్ చేయగలడని ఆశిస్తున్నానని ఆండర్సన్ దీమా వ్యక్తం చేశాడు. టెస్టు గెలుపు కోసం తన సామర్థ్యం మేరకు సహకారం అందించగలడని నమ్ముతున్నామని పేర్కొన్నాడు. జో రూట్ బ్యాటింగ్ విషయంలో ఆందోళనలు ఉన్నాయని తాను భావించడం లేదన్నాడు. కాగా ఆదివారం మొదటి సెషన్‌లో రూట్ కుడి చిటికెన వేలికి చిన్న గాయమవ్వడంతో చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఫీల్డ్‌లోకి రాలేదు. ఈ ఈసీడీ (ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు) ధ్రువీకరించింది. అయితే మిగిలిన రెండు రోజుల ఆటకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
కాగా విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లండ్ 399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఇంగ్లండ్ 1 వికెట్ నష్టానికి 67 పరుగుల వద్ద మూడవ రోజు ఆట మిగిలివుంది. చివరి రెండు రోజుల్లో 332 పరుగులు సాధించాల్సి ఉంది.