Revanth Reddy: టీఎస్‌ను టీజీగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పిన రేవంత్‌రెడ్డి
- కేబినెట్ నిర్ణయాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన రేవంత్‌రెడ్డి
- ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అని నినదించారని గుర్తు చేసిన సీఎం
- తెలంగాణ తల్లిలోని రాచరిక పోకడలు తొలగించి అడవిబిడ్డ రూపురేఖలతో మార్పులు చేస్తామని వివరణ
నిన్నటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ (TG)గా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమేనని, దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ‘జయహే తెలంగాణ’ను అధికారిక గీతంగా మార్చాలని నిర్ణయించుకున్నామని, తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు లేకుండా సగటు రాష్ట్ర అడవిబిడ్డ రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కాకుండా టీజీగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని, ఉద్యమ సమయంలో వారు అలాగే నినదించారని తెలిపారు. వారి ఆంకాక్షలను నెరవేరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.