Raghu Rama Krishna Raju: నేను జగన్ కు మాత్రమే శత్రువును.. ఆమెతో నాకు శత్రుత్వం లేదు: రఘురామకృష్ణరాజు
- నర్సాపురం ఎంపీ స్థానం నుంచి ఉమాబాలను బరిలోకి దింపుతున్న వైసీపీ
- ఆమెతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదన్న రఘురాజు
- తల్లిని, చెల్లెలిని తిట్టించడాన్ని జగన్ మానేయాలని సూచన
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచి టీడీపీ - జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, నరసాపురం ఎంపీ స్థానం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను వైసీపీ హైకమాండ్ బరిలోకి దింపుతోంది.
ఈ నేపథ్యంలో రఘురాజు మాట్లాడుతూ... తాను సీఎం జగన్ కు మాత్రమే శత్రువునని, ఉమాబాలతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. తనపై పోటీకి రోజుకొక అభ్యర్థి పేరు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సొంత తల్లిని, చెల్లెలిని తిట్టించడాన్ని జగన్ మానేయాలని రఘురాజు అన్నారు. కుటుంబ సభ్యులకు మర్యాద ఇవ్వడాన్ని నేర్చుకోవాలని చెప్పారు. ఆ తర్వాతే మహిళా సాధికారిత గురించి మాట్లాడాలని అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు మాదిరి జగన్ ఫీల్ కావొద్దని చెప్పారు.
2023లో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని జగన్, ఆయన మంత్రులు చెప్పారని... ఇప్పుడు 2024 వచ్చిందని అన్నారు. అవినీతికి తావు లేకుండా పోలవరంను పూర్తి చేస్తామని జగన్ ఇప్పుడు కూడా చెపుతున్నారని... ఇలాంటి నటుడిని తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. అన్నమయ్య డ్యామ్ కి గేట్లు ఏర్పాటు చేయలేని జగన్... పోలవరం ప్రాజెక్ట్ ఎలా కడతారని ఎద్దేవా చేశారు.