Paytm: మీ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు... పేటీఎం ఉద్యోగులకు యాజమాన్యం భరోసా
- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు
- పేటీఎం భవిష్యత్తుపై అనిశ్చితి
- సంస్థ ఉద్యోగులతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కీలక సమావేశం
- లేఆఫ్ లు ప్రకటించే ఆలోచన లేదని స్పష్టీకరణ
నిన్నమొన్నటి వరకు దేశంలో నెంబర్ వన్ పేమెంట్స్ పోర్టల్/యాప్ గా ఉన్న పేటీఎం... అనూహ్యరీతిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ విధించిన ఆంక్షలే అందుకు కారణం. అయితే, పేటీఎం భవిష్యత్తు ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దాంతో ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తమ ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహించారు. 'మీ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు... ఉద్యోగులను తొలగించే ఆలోచనేదీ మాకు లేదు' అంటూ స్పష్టం చేశారు. అసలేం జరిగిందో తెలియలేదని అన్నారు. ఈ అంశంపై ఆర్బీఐతో చర్చిస్తున్నామని, వివిధ బ్యాంకులతోనూ మాట్లాడుతున్నామని... త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు.
ఉద్యోగులందరినీ తాము పేటీఎం కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, లేఆఫ్ లు ఉండవని అన్నారు. దాదాపు 900 మంది ఉద్యోగులతో విజయ్ శేఖర్ శర్మ గంట సేపు మాట్లాడారు.