Rahul Gandhi: రాహుల్ ’బిస్కెట్’ తినడానికి నిరాకరించి కాంగ్రెస్‌కు రాజీనామా చేశా.. అసోం సీఎం తీవ్ర వ్యాఖ్యలు
- రాహుల్‌గాంధీ ఇచ్చిన బిస్కెట్ తినేందుకు కుక్కపిల్ల నిరాకరణ
- దానిని కార్యకర్తకు ఇచ్చారని బీజేపీ ఆరోపణ
- వీడియో షేర్ చేసిన హిమంత బిశ్వశర్మ
- తనతోనూ బిస్కెట్ తినిపించాలని చూశారని ఆరోపణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచీ ఆయనపై విరుచుకుపడుతున్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాజాగా మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ కార్యకర్తకు రాహుల్ కుక్క బిస్కెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. కుక్కపిల్లకు రాహుల్ గాంధీ బిస్కెట్ తినిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది.
ఈ వీడియోను భారత్ జోడో న్యాయ్ యాత్ర తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఝార్ఖండ్ పర్యటనలో రాహుల్ ఓ బిస్కెట్ ప్యాకెట్ అడగడం, ఓ బిస్కెట్‌ను కుక్కపిల్లకు ఇవ్వడం కనిపించింది. ఆ తర్వాత రాహుల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు కార్యకర్తలు పోటెత్తారు. అయితే, ఆ వీడియోలో కార్యకర్తకు బిస్కెట్ ఇస్తున్నట్టుగా మాత్రం ఎక్కడా కనిపించలేదు.
అసోం సీఎం పోస్టు చేసిన వీడియోలో కార్యకర్తకు రాహుల్ గాంధీ బిస్కెట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాహుల్ తన మద్దతుదారులకు కుక్క బిస్కెట్లు ఇస్తున్నారంటూ విమర్శలు ప్రారంభించింది.
ఒకప్పుడు కాంగ్రెస్ నేత అయిన హిమంత.. గతంలో రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్కకు తినిపించిన ప్లేట్ లోని బిస్కెట్లను తనతో పాటు మిగతా నేతలకు ఆఫర్ చేశారని చెప్పారు. రాహుల్, ఆయన కుటుంబ సభ్యులు తనతో మాత్రం బిస్కెట్ తినిపించలేకపోయారని అన్నారు. బిస్కెట్ తినడానికి తిరస్కరించి పార్టీకి రాజీనామా చేశానని, తాను అస్సామీ, భారతీయుడినైనందుకు గర్వపడుతున్నట్టు చెప్పారు.