MP VijayaSai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

Jublee Hills Police Filed A Case Aganist MP VijayaSai Reddy
  • తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి
  • టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ - వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ
తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మండిపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ - వైసీపీ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఆరోపించారు. రాజ్యసభలో ఆన్ రికార్డ్ గా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఎంపీ విజయసాయి రెడ్డిపై ఈమేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు సుజాత ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నిధులు సమకూర్చుతోందని కాల్వ సుజాత ఆరోపించారు. ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, వైసీపీ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. అయితే, తెలంగాణలో రేవంత్ సర్కారు సుస్థిరంగా ఉందని, ప్రజా పాలన కొనసాగిస్తోందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని ధీమా వ్యక్తం చేశారు.
MP VijayaSai Reddy
Police case
Telangana
Jubilee Hills PS
Rajya Sabha
MP Comments
kalva Sujatha

More Telugu News