SV Krishna Reddy: నటుడిగా నాకు ఆ దర్శకులెవరూ ఛాన్స్ ఇవ్వలేదు: ఎస్వీ కృష్ణారెడ్డి
- వరుస హిట్స్ ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి
- నటుడిగా తన ప్రయత్నాల ప్రస్తావన
- దర్శకుడిగా సాధించిన విజయాలు
- మెగాస్టార్ తో కుదరలేదన్న డైరెక్టర్
ఎస్వీ కృష్ణారెడ్డి .. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఒకానొక సమయంలో వరుస హిట్లను నమోదు చేస్తూ వెళ్లారు. రాజేంద్రుడు గజేంద్రుడు .. యమలీల .. శుభలగ్నం .. వంటి సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు.
"హీరోగా నేను ట్రై చేసే రోజులలో జంధ్యాల గారినీ .. సీనియర్ వంశీ గారినీ .. దాసరి గారిని కలిశాను. నా ఫోటోలు ఇచ్చాను .. నేను ఎలా యాక్ట్ చేస్తాననేది తెలియడం కోసం కొన్ని వీడియో క్లిప్స్ ఇచ్చాను. కానీ వాళ్లెవ్వరూ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తరువాత నేను డైరెక్టర్ ను అయిన తరువాత, హీరోగా కనిపించాలనే ముచ్చటను తీర్చుకున్నాను" అన్నారు నవ్వుతూ.
"పెద్ద హీరోలతో హిట్స్ ఇవ్వలేకపోయాననే ఒక విమర్శ నాపై ఉంది. బాలకృష్ణగారితో చేసిన 'టాప్ హీరో' మ్యూజికల్ హిట్ గానే నేను భావిస్తాను. నాగార్జునగారితో చేసిన 'వజ్రం' ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిరంజీవిగారికి కూడా ఒక కథను వినిపించాను. ఆయన ఆలోచించి చెబుతానని అన్నారు. ఆ తరువాత ఇక ముందుకు వెళ్లడం కుదరలేదు" అని చెప్పారు.