AP Budget: 'వైఎస్సార్ భరోసా - పీఎం కిసాన్'తో 53.53 లక్షల మంది రైతులకు సాయం అందింది: ఏపీ మంత్రి బుగ్గన

Formers Welfare Is Our Priority Says AP Minister Buggana In Assembly
  • ఈ పథకానికి రూ.33 వేల కోట్లు
  • వైఎస్సార్ చేయూతకు రూ.14 వేల కోట్లు
  • అటవీ భూముల సాగుకు రూ.13.5 వేల సాయం
సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం జగన్ సర్కారు ప్రవేశ పెట్టిన వివిధ పథకాలు ఫలితాలనిస్తున్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో వెల్లడించారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా తీర్చిదిద్దేందుకు, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. తాజా బడ్జెట్ లోనూ వ్యవసాయ రంగానికి, అనుబంధ పరిశ్రమలకు మంచి కేటాయింపులు చేశామని చెప్పారు.

రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాలకు రూ.33.3 వేల కోట్లు వెచ్చించామని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ పథకాలతో 53.53 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు. వైఎస్సార్ చేయూత పథకానికి రూ.14,129 కోట్లు కేటాయించామన్నారు. కౌలు రైతులతో పాటు అటవీ భూములు సాగుచేసుకునే రైతులకు రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

పకృతి వైపరీత్యాలు, చీడ పీడలతో పంట నష్టం వాటిల్లితే రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ పథకానికి రూ.3,411 కోట్లు కేటాయించామన్నారు. సున్నా వడ్డీ పంట రుణాలకు రూ. 1,835 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా సేవలందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, విద్యుత్ సబ్సిడీ కోసం రూ,37,374 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.1,277 కోట్లు అందించడంతో పాటు ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు.

యంత్ర సేవల పథకం కింద రైతులకు ఆధునిక యంత్రాలను అందజేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యానవనాల సాగు కోసం వివిధ పథకాలతో రూ.4,363 కోట్లు అందించామని, 2,356 మంది ఉద్యానవన సహాయకులను నియమించామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 2,43,000 ల మత్స్యకార కుటుంబాలకు మేలు చేకూరిందని చెప్పారు. చేపల వేటపై నిషేధం ఉండే కాలంలో మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని, ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఆక్వా కల్చర్ తో 16 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని మంత్రి తెలిపారు.
AP Budget
Agriculture
Andhra Pradesh
Buggana Rajendranath
YS Jagan
Farmers

More Telugu News