G. Kishan Reddy: విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది: కిషన్ రెడ్డి

Kishan Reddy inspects secunderabad railway station development works
  • రూ.750 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 
  • మల్టీ లెవల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్ రైల్వే ట్రాప్ ప్లాట్ ఫామ్స్ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడి
  • చర్లపల్లి టెర్మినల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్న కేంద్రమంత్రి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకుంటోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రూ.750 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బుధవారం ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

మల్టీ లెవల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్ రైల్వే ట్రాప్ ప్లాట్ ఫామ్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. తక్కువ సమయంలో వేగంగా ఈ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సాగుతున్నట్లు తెలిపారు. 2025 నవంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయన్నారు.

అదే సమయంలో చర్లపల్లి టెర్మినల్ పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. అది కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ 22 లిఫ్టులు 30కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రయాణికులు నేరుగా స్టేషన్‌లోకి రావడానికి బయటికి వెళ్ళడానికి గగనతలం నుంచే ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు.
G. Kishan Reddy
Telangana
BJP
Indian Railways

More Telugu News