Peddapalli District: గెలిచే స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం మద్దతిచ్చుకుంటున్నాయి.. నాకు అది నచ్చలేదు: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందాలు మున్ముందు అందరూ గమనిస్తారని వెల్లడి
- బీజేపీతో బీఆర్ఎస్ కలవడం నచ్చకపోవడం వల్లే కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడి
- భారత్ జోడో న్యాయ్ యాత్ర వంటి కార్యక్రమాలు ప్రేరేపించాయన్న వెంకటేశ్
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో బీజేపీ గెలవగలిగే లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో బీజేపీ అంతర్గతంగా మద్దతు ఇచ్చుకుంటున్నట్లుగా తనకు అర్థమవుతోందని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ అన్నారు. ఆయన గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పెద్దపెల్లి ఎంపీగా గెలిచారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గతంగా ఏ రకంగా ఒప్పందాలు జరుగుతున్నాయో రానున్న కాలంలో మీడియా మిత్రులు, అందరూ గమనిస్తారన్నారు. తాను పార్టీ మారడానికి గల కారణాలను ఇంతకుముందే చెప్పానన్నారు.
తనకు మరో 18 ఏళ్ల సర్వీస్ ఉండగానే తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్ధేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయానని... ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి పెద్దపల్లి ఎంపీగా గెలిచానన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు మారిపోయాయని... అందుకే ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. అయిదేళ్లుగా ఏ బీజేపీపై అయితే పోరాటం చేస్తున్నామో... అదే పార్టీతో బీఆర్ఎస్ కలవడం తనకు నచ్చలేదన్నారు. అందుకే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు.
పెద్దపల్లి ఎంపీగా తాను తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ వేదికగా గళమెత్తానన్నారు. ఇన్నాళ్లు బీజేపీతో పోరాటం చేసి ఇప్పుడు వారితో కలవడం తాను జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పారు. ఈ కారణంగానే తనకు రాజకీయ జన్మను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశాన్ని విభజిస్తున్న బీజేపీని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర వంటి కార్యక్రమాలు తనను ఆ పార్టీలో చేరడానికి ప్రేరేపించాయన్నారు.