Ponnam Prabhakar: జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి పొన్నం ఆదేశాలు
- తాగునీటిపై అధికారులతో బుధవారం మంత్రి సమీక్ష
- నగరం పేరు, గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పని చేయాలని సూచన
- ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దన్న పొన్నం
రానున్నది వేసవి కాలం కావడంతో హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తాగునీటిపై అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు.
నగరం పేరు, గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పని చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని మంత్రి సూచించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు, శాఖల వారీగా పనితీరు, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సమగ్రంగా వివరించారు.