Peddireddi Ramachandra Reddy: అప్పుడు మా అందరికీ గన్ మెన్లను తొలగించారు.. జగన్ ను జైల్లో పెట్టారు: షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్
- తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని షర్మిల ఆగ్రహం
- కాంగ్రెస్ ను వీడినప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టారన్న పెద్దిరెడ్డి
- కాంగ్రెస్ పరోక్షంగా టీడీపీకి మద్దతును ఇస్తోందని విమర్శ
ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలినైన తనకు సెక్యూరిటీ ఎందుకు కల్పించడం లేదని... తనకు చెడు జరగాలనే ఇదంతా చేస్తున్నారా? అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షురాలిగా రాష్ట్రమంతటా తాను విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని.. తనకు భద్రత కావాలని అడిగినా ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆమె మండిపడ్డారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? ప్రతిపక్ష నేతలకు భద్రత అవసరం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చెడు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.
ఈ నేపథ్యంలో, షర్మిల వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు తమకు గన్ మెన్లను తొలగించారని చెప్పారు. తమ మద్దతుతో గెలిచిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి... తమనే ఇబ్బంది పెట్టాలని చూశారని విమర్శించారు. తమ నేత జగన్ ను 16 నెలలు జైల్లో ఉంచారని చెప్పారు.
ఏపీలో విపక్షాల పొత్తులపై పెద్దిరెడ్డి స్పందిస్తూ... టీడీపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతును ఇస్తోందని అన్నారు. రాష్ట్ర బీజేపీలో ఉన్న నేతలంతా టీడీపీకి చెందినవారేనని చెప్పారు. తొలి నుంచి కూడా రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నీ కలిసే ఉన్నాయని తెలిపారు. ఎంతమంది కలసికట్టుగా వచ్చినా... తమ నాయకుడు జగన్ సింగిల్ గానే వస్తారని అన్నారు. ఏపీలో వైసీపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పారు.