Joe Biden: హమాస్ పేరు గుర్తురాక జో బైడెన్ ఆపసోపాలు.. చివరికి ‘ప్రతిపక్షం’గా అభివర్ణన.. వీడియో ఇదిగో!
- వీడియోను పంచుకున్న డొమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి డీన్ ఫిలిప్స్
- అందరూ ఆయనను మోస్తున్నందుకు సిగ్గుపడాలని వ్యాఖ్య
- తమను, బైడెన్‌ను విపత్తులోకి నడిపిస్తున్నారని ఆగ్రహం
అమెరికాకు అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన జో బైడెన్ తరచూ వార్తల్లోకి ఎక్కుతూ విమర్శల పాలవుతున్నారు. 81 ఏళ్ల బైడెన్ తాజాగా మరోమారు పతాక శీర్షికలకెక్కారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ పేరు గుర్తురాక దానిని ‘ప్రతిపక్ష ఉద్యమం’గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు నిధులు అందించే ద్వైపాక్షిక ఇమ్మిగ్రేషన్, సరిహద్దు ఒప్పందానికి మద్దతు ఇవ్వాలని రిపబ్లికన్లను కోరుతూ మంగళవారం బైడెన్ ప్రసంగించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల చర్చల పురోగతి గురించి ప్రశ్నించగా బైడెన్ బదులిస్తూ.. ‘కొంత కదలిక ఉంది‘ అని తడబడుతూ ఆగిపోయిన ఆయన.. ‘‘నన్ను పదాలు వెతుక్కోనివ్వండి, కొంత కదలిక ఉంది. ప్రతిస్పందన ఉంది. ‘ప్రతిపక్షం’ నుంచి ప్రతిస్పందన వచ్చింది, కానీ.. ’’ అంటూ చెప్పుకొచ్చారు. చివరికి ఒక రిపోర్టర్ ‘హమాస్’ అని చెప్పగానే అవును, నన్ను క్షమించండి. హమాస్ నుంచే వచ్చింది కానీ, అది కొంత ఓవర్‌గా అనిపిస్తోంది. అది ఎక్కడ ఉందో నిజంగా మాకు తెలియదు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉండి బైడెన్‌ను సవాలు చేస్తున్న డీన్ ఫిలిప్స్ ‘ఎక్స్’లో బైడెన్ ఫుటేజీని పంచుకున్నారు. ‘‘నేను మా అధ్యక్షుడిని అభినందిస్తున్నాను. నేను ఆయనకు ఓటు వేశాను. ప్రచారం కూడా చేశాను. ఆయన మా ఇంటిని సందర్శించారు. మా పట్ల, దేశం పట్ల దయచూపారు. కానీ, మీరందరూ అంతా ఓకే అంటూ నటిస్తున్నందుకు సిగ్గుపడాలి. మీరు మమ్మల్ని, ఆయన(బైడెన్)ను విపత్తులోకి నడిపిస్తున్నారు. ఈ విషయం మీక్కూడా బాగా తెలుసు’’ అని తీవ్ర విమర్శలు చేశారు.