Telangana: తెలంగాణలో కాంగ్రెస్‌కు 10 లోక్ సభ సీట్లు... బీఆర్ఎస్కు మూడు సీట్లు: 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే
- 17 లోక్ సభ స్థానాలకు గాను 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా
- బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెరో మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చునన్న సర్వే
- మజ్లిస్ పార్టీకి ఒక స్థానం వస్తుందన్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో తేలింది. 'మూడ్ ఆఫ్ ది నేషన్' ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని వెల్లడైంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది.
తెలంగాణలోని పదిహేడు లోక్ సభ స్థానాల్లో 35,801 శాంపిల్స్‌ను సేకరించింది. ఈ పోల్ డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 మధ్య నిర్వహించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడు, బీజేపీ మూడు స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని, మజ్లిస్ పార్టీ ఒక సీటు గెలుచుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది.
కాంగ్రెస్ పార్టీకి ఈసారి 41.2 శాతం ఓట్లు వస్తాయని వెల్లడింది. 2019లో కేవలం 29.8 శాతం ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్కు 29.1 శాతం, బీజేపీకి 21.1 శాతం ఓట్లు వస్తాయని తేలింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు, మజ్లిస్ ఒక సీటును గెలుచుకున్నాయి.