Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ
- టీడీపీ నేతల భూములకు విలువ లభించేలా ఐఆర్ఆర్ డిజైన్ మార్చారని అభియోగం
- ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ
- చంద్రబాబు, నారాయణ, లోకేశ్, లింగమనేని రమేశ్, రాజశేఖర్ ల పేర్లతో చార్జిషీట్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్ లను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ నేడు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
ఐఆర్ఆర్ అలైన్ మెంట్ ద్వారా అనుచితంగా లబ్ది పొందాలని చూశారని సీఐడీ తన చార్జిషీట్ లో ఆమోదించింది. చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ కుంభకోణం యావత్తు జరిగిందని పేర్కొంది.
అమరావతి వద్ద టీడీపీ నేతల భూములకు అధిక విలువ లభించేలా ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర కనెక్టివిటీ రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు చేశారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఐఆర్ఆర్ కేసు నమోదు చేసింది.