Telangana: ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
- టీఎస్పీఎస్సీతో పాటు ఇతర విభాగాలు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉత్తర్వులు
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్‌ను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరీల్లో నూటికి 33 శాతం (1/3) రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు... ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియలో దీనిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు-1996 ప్రకారం మహిళలకు ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరిల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిబంధన ఉంది.
గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ కావడాన్ని పలువురు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో 'రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా' కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఎస్పీఎస్సీ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని 2022 డిసెంబర్ 2న మెమో జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి టీఎస్పీఎస్సీతో పాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.