Kim Jong Un: శత్రువులను ఏరిపారేసేందుకు మిలటరీని ఉపయోగించడానికి వెనకాడబోం.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరిక
- మిలటరీ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ హెచ్చరికలు
- దక్షిణ కొరియా తమకు నంబర్ 1 శత్రువని పేర్కొన్న సుప్రీం లీడర్
- తమపై బలప్రయోగం చేయాలని చూస్తే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటామన్న కిమ్
శత్రువులను ఏరిపారేసేందుకు అవసరమైతే సైన్యాన్ని ఉపయోగించే విషయంలో ఏమాత్రం వెనకాడబోమని ఉత్తరకొరియా సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలు జారీ చేశారు. మిలటరీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ కిమ్ ఈ హెచ్చరిక చేసినట్టు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
గురువారం రక్షణ మంత్రిత్వశాఖను సందర్శించిన కిమ్.. పాలక వర్కర్స్ పార్టీ సిద్ధాంతాలను నిలబెట్టేందుకు, దేశ రక్షణకు సైనికులను సమీకరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. శత్రువులు మనపై బలప్రయోగం చేయాలని ప్రయత్నిస్తే చరిత్రను మార్చేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడబోమని, వారిని తుడిచిపెట్టేందుకు తమ సూపర్ పవర్ మొత్తాన్ని ఉపయోగిస్తామని హెచ్చరికలు జారీచేశారు.
అంతేకాదు, ఆగర్భ శత్రువు దక్షిణ కొరియాతో చర్చలు జరిపేది లేదని మరోమారు చెప్పారు. అది తమ శత్రువు నంబర్ 1 అని అభివర్ణించారు. ఉత్తర కొరియా శాంతి స్థాపన, భద్రతను నిర్ధారించేందుకు శక్తిమంతమైన సైనిక సంసిద్ధత విధానమే ఏకైక మార్గమని కిమ్‌ను ఉటంకిస్తూ కేసీఎన్ఏ తెలిపింది.