PV Narasimha Rao: పీవీ నరసింహారావుకు భారతరత్న.. చరణ్ సింగ్, స్వామినాథన్ లకు కూడా!

PV Narasimha Rao honored with Bharat Ratna

  • ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారాలు
  • ఇప్పటికే కర్పూరీ ఠాకూర్, ఎల్ కే అద్వానీలకు   భారతరత్న ప్రకటన 
  • ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ

తెలుగుజాతి ఆణిముత్యం, బహుబాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ , హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న ప్రకటించినట్టయింది. పీవీకి భారతరత్న రావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పీవీ జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు భారత ప్రధానిగా ఆయన సేవలందించారు. 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 10 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్ర హోం మంత్రి, భారత విదేశాంగ మంత్రి, భారత రక్షణ మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. ప్రధానిగా పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చేశాయి. ఈరోజు భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటం వెనుక ఆయన ఆరోజు వేసిన పునాదులే కారణం.

  • Loading...

More Telugu News