Shreyas Iyer: టీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్ మన్ దూరం!

Shreyas Iyer reportedly miss rest of the series
  • ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం!
  • తొలి రెండు టెస్టుల్లో ఆడని కేఎల్ రాహుల్... రెండో టెస్టుకు దూరమైన జడేజా
  • వీపు నొప్పి, గజ్జల్లో గాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్
  • సిరీస్ లో మిగిలిన మూడు టెస్టులకు అయ్యర్ దూరం
ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. మాజీ సారథి విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ లో మరో రెండు టెస్టులకు దూరమయ్యాడు. గాయాలతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ తొలి రెండు టెస్టులకు, జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పుడు మరో స్టార్ బ్యాట్స్ మన్ జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 

టాపార్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీపు నొప్పి, గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈ నెల 15 నుంచి రాజ్ కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లోనే కాదు, మిగతా రెండు టెస్టుల్లోనూ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగా మారింది. 

రెండో టెస్టు ముగిశాక అందరి క్రికెట్ సామగ్రి విశాఖ నుంచి రాజ్ కోట్ కు తరలించగా, శ్రేయాస్ అయ్యర్ కిట్ ను మాత్రం అతడి స్వస్థలం ముంబయికి తరలించారు. గాయం తీవ్రత దృష్ట్యా శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండబోవడంలేదని ఈ పరిణామం ద్వారా అర్థమవుతోంది. 

ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును ఇంగ్లండ్ గెలవగా, రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. మిగతా మూడు టెస్టుల్లో ఆడే టీమిండియాను సెలెక్టర్లు నేడు ఎంపిక చేయనున్నారు.
Shreyas Iyer
Injury
Test Series
Team India
England

More Telugu News