PV Narasimha Rao: ఈ నేల ముద్దుబిడ్డ పీవీకి భారతరత్న మనందరికీ గర్వకారణం: చంద్రబాబు
- మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన కేంద్రం
- సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు
- భారతరత్నకు పీవీ అర్హుడని కితాబు
- అనేక సందర్భాల్లో ఆయనను కలుసుకున్నానని వెల్లడి
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు మరణానంతరం భారతరత్న ప్రకటించడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేల ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. భారతరత్న పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హుడని కొనియాడారు.
సుప్రసిద్ధ పండితుడు, నాయకుడు, ఆర్థికవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, మానవతావాది మన పీవీ నరసింహారావు అని కీర్తించారు. పీవీ నరసింహారావు దృఢమైన నాయకత్వంలో అంకురించిన ఆర్థిక సంస్కరణలు కష్టకాలంలో దేశాన్ని ముందుకు నడిపించాయని చంద్రబాబు వివరించారు.
మహోన్నత భారతదేశానికి ప్రపంచవేదికపై సమున్నత స్థానం లభించిందంటే అది పీవీ దార్శనికత వల్లేనని స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో ఆ మహనీయుడిని కలుసుకోవడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తానని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఆయన ఆలోచనా దృష్టి నుంచి స్ఫూర్తి పొందుతుంటానని వివరించారు.