PV Narasimha Rao: ఈ అత్యున్నత పురస్కారానికి పీవీ అన్ని విధాలా అర్హులు: సీఎం జగన్
- మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 'భారతరత్న'
- సంతోషం వెలిబుచ్చిన ఏపీ సీఎం జగన్
- ఇది తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవం అని వెల్లడి
- పీవీ ఉన్నతస్థాయి రాజకీయ, నైతిక విలువల కలిగిన వ్యక్తి అని కితాబు
దివంగత మాజీ ప్రధాని, తెలుగువాడు పీవీ నరసింహారావుకు ఎన్డీయే సర్కారు సర్వోత్తమ పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. పీవీ నరసింహారావుకు మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల సంతోషం వెలిబుచ్చారు.
భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారానికి పీవీ అన్ని విధాలా అర్హులని కొనియాడారు. అందుకే అన్ని వర్గాల నుంచి అభినందనల వర్షం కురుస్తోందని వివరించారు. ఉన్నతస్థాయి రాజకీయ, నైతిక విలువలు కలిగిన ఓ రాజనీతి కోవిదుడికి భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ లభించిన గౌరవం అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇక, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవానికి ఆద్యుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించడం హర్షణీయమని సీఎం జగన్ పేర్కొన్నారు.