Revanth Reddy: కేసీఆర్ సభకు వచ్చి మేం తప్పు చేస్తే సూచనలు చేయాలి... ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండకూడదు: సీఎం రేవంత్ రెడ్డి
- కేసీఆర్ సభకు హాజరై తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించేవి ఉంటే సూచనల చేయాలని విజ్ఞప్తి
- ప్రతిపక్ష నేత ఇప్పటికైనా సభకు రావాలన్న రేవంత్ రెడ్డి
- మేం చేసిన మంచిని బీఆర్ఎస్ నేతలు ప్రశంసించడం లేదు... వారి నాయకుడి మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య
- టీజీ మార్పు చేయడంతో పాటు జయజయహే తెలంగాణను అధికారిక గేయంగా చేస్తున్నట్లు వెల్లడి
- జూనియర్ ఆర్టిస్ట్ డ్రామాలు అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం
ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోవడం సభకు గౌరవం కాదని... ఆ కుర్చీ ఖాళీగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదని... ఆయన సభకు వచ్చి ఈ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు చేస్తే బాగుండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని... తెలంగాణ అంటే ఒక భావోద్వేగం అన్నారు. ఇలాంటి తెలంగాణలో మీలో (బీఆర్ఎస్) మార్పు రావాలని ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి... ఈ హోదా ద్వారా ప్రజల తరఫున కొట్లాడేందుకు మరో అవకాశం ఇచ్చారన్నారు.
కానీ ప్రధాన ప్రతిపక్ష నేత... గవర్నర్ ప్రసంగానికి హాజరు కాలేదన్నారు. ప్రతిపక్ష నేత సభకు హాజరై... మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైనా ఉంటే సూచనలు చేసేలా ఉండాలన్నారు. కానీ ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం బాధాకరమన్నారు. 80వేల పుస్తకాలను చదివానని కేసీఆర్ పదేపదే చెబుతారని... కానీ అందుకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా సభకు రావాలని కోరుకుంటున్నామన్నారు.
తమ పాలన అరవై రోజులు పూర్తి చేసుకుందన్నారు. ప్రతిక్షణం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే తాము ముందుకు సాగుతున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడినప్పుడు తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చుకొని, ఇతర వాటిలో సూచనలు చేస్తారని భావించానని... కానీ వారి నాయకుడి మెప్పు కోసం ఆయన తమపై దాడి చేసినట్లుగా కనిపించిందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నో లోపభూయిష్ఠ నిర్ణయాలు జరిగాయని విమర్శించారు. 9 ఏళ్లయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. సమైక్యాంధ్రలో ఉన్న నిర్బంధాలు గత తొమ్మిదేళ్లలోనూ కొనసాగాయన్నారు.
టీజీ మార్పు.. తెలంగాణ తల్లి... తెలంగాణ గేయంపై రేవంత్ రెడ్డి
TG అంటే తెలంగాణ ఆత్మగౌరవమని... అందుకే తాము TS నుంచి టీజీగా మార్చామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తాము సరిదిద్దే ప్రయత్నం చేశామన్నారు. అలాగే అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు, రాచరిక దర్పం కనిపిస్తున్నందున మార్చాలని నిర్ణయించామన్నారు. గవర్నర్ ప్రసంగంలో వీటన్నింటినీ పొందుపరిచామన్నారు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ... అక్క... సోదరి.. వారు ఎప్పుడూ బంగారం, వజ్రవైడూర్యాలు పెట్టుకున్న సందర్భాలు లేవన్నారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మలా ఉండాలని ఆశించాం.. కానీ రాచరిక పోకడతో వజ్రవైడూర్యాలతో గత ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. అందుకే తెలంగాణ తల్లిని మార్చాలని నిర్ణయించామన్నారు. ఉద్యమం సమయంలో ఎక్కడ చూసినా 'జయజయహే తెలంగాణ' గేయం వినపడిందని గుర్తు చేశారు. అందుకే ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మార్చామన్నారు.
రైతు బంధు బీఆర్ఎస్ ఎన్ని నెలలకు వేసిందంటే...
తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే తమపై శాపనార్థాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని... రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామన్నారు. రైతుబంధు వేయలేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని... కానీ గతంలో వారు ఎలా వేసారో గుర్తుంచుకోవాలన్నారు. 2018-19లో రైతుబంధు వేయడానికి 5 నెలలు పడితే, 2019-20లో తొమ్మిది నెలలు, 2020-21లో నాలుగు నెలలు, 2021-22లో నాలుగు నెలలు పట్టిందన్నారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని తాము పదేపదే చెబుతున్నప్పటికీ రెండు నెలలు గడవకముందే విమర్శలు చేయడం ఏమిటన్నారు.
జూనియర్ ఆర్టిస్ట్ అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం
బీఆర్ఎస్ నాయకుడు ఆటో ఎక్కి వీడియోను తీయించుకోవడం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో ఎక్కిన ఘటనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు... అతను ఆటో ఎక్కి డ్రామాలు చేశాడంటూ రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. ఇంకో నటుడేమో రూ.100 పెట్టి పెట్రోల్ కొనుగోలు చేస్తారు కానీ... రూ.1 పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడని విమర్శించారు. మన సభలో కవులు, కళాకారులతో పాటు నటులు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు.
కోట్లాది మంది మహిళలు ఎక్కే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై విమర్శలు సరికాదన్నారు. ఉచిత బస్సు పథకంతో దేవాదాయ శాఖకు రూ.93 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. తాము రాగానే 7వేల నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో పదిహేను రోజుల్లో 15వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.