PV Narasimha Rao: పీవీ నరసింహారావు సేవలకు సముచిత గౌరవం దక్కింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan hails PV Narasimha Rao after union govt announced Bharataratna

  • పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన కేంద్రం
  • పత్రికా ప్రకటన విడుదల చేసిన పవన్ కల్యాణ్
  • విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారని వెల్లడి
  • ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం అందించారని కితాబు 

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. భారతదేశ 9వ ప్రధానమంత్రిగా ఆయన తీసుకువచ్చిన సరళీకరణ విధానాలతో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం పొందిందని తెలిపారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు అనుపమానమైనవని కీర్తించారు. ఆ సేవలకు సముచిత గౌరవం ఇస్తూ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడం ప్రతి తెలుగువాడు సంతోషించదగ్గ అంశం అని పేర్కొన్నారు. 

టెక్నాలజీని విస్తృతపర్చడంతో పాటు దేశ రక్షణ, దౌత్య సంబంధ విషయాల్లో గణనీయమైన విజయాలు సాధించారని పవన్ కల్యాణ్ వివరించారు. బహుభాషా కోవిదుడైన పీవీ నరసింహారావు కంప్యూటర్ సంబంధింత అంశాలను సైతం నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కరం ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి 'వేయి పడగలు' నవలను పీవీ నరసింహారావు హిందీలోకి అనువదించి ఆ రచన విలువను అందరికీ పంచారని వెల్లడించారు. 

ఉన్నతమైన పదవిలో ఉన్నవారికి దేశాభివృద్ధి విషయంలో దూరదృష్టి అవసరం అనడానికి పీవీ నరసింహారావు సంస్కరణలు, పాలనా విధానమే తార్కాణం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ మహనీయుడికి భారతరత్న దక్కిన నేపథ్యంలో మనఃపూర్వక నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

ఇక, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ పరిశోధకుడు ఎంఎస్ స్వామినాథన్ కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News