Kodikathi Srinu: జైలు నుంచి విడుదలైన కోడికత్తి శ్రీను
- కోడికత్తి శ్రీనుకు నిన్న బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- నేడు విశాఖ జైలు అధికారులకు అందిన బెయిల్ కాపీ
- లాంఛనాలు పూర్తి చేసి కోడికత్తి శ్రీనును విడుదల చేసిన జైలు అధికారులు
- శ్రీనుకు ఘనస్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, దళిత నేతలు
కోడికత్తి కేసులో ఐదేళ్ల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జనుపల్లి శ్రీను ఎట్టకేలకు విడుదలయ్యాడు. కోడికత్తి కేసు నిందితుడిగా ఉన్న శ్రీనుకు నిన్న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్ తో పాటు, రూ.25 వేల చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్ లో హాజరవ్వాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల కాపీ విశాఖ జైలు అధికారులకు నేడు అందింది. అన్ని లాంఛనాలు పూర్తి చేసిన విశాఖ జైలు అధికారులు కోడికత్తి శ్రీనును విడుదల చేశారు.
అప్పటికే జైలు వద్దకు చేరుకున్న శ్రీను కుటుంబ సభ్యులు, దళిత నేతలు అతనికి స్వాగతం పలికారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ చిత్ర పటం పట్టుకున్న కోడికత్తి శ్రీను చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు.