Jagan: ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించిన విషయాలు ఇవే?
- ఈ మధ్యాహ్నం మోదీతో భేటీ అయిన జగన్
- పోలవరం ప్రాజెక్టు నిధులను విడుదల చేయాలని కోరిన సీఎం
- కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకారం అందించాలని విన్నపం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీలో ఏ అంశాలపై చర్చించారనే వివరాలు అధికారికంగా బయటకు రాలేదు. అయితే, భేటీ వివరాలను సాక్షి మీడియా వెల్లడించింది. సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ప్రధాని, ముఖ్యమంత్రి చర్చించారు.
పోలవరం ప్రాజెక్ట్ మొదటి విడత పూర్తి చేయడానికి రూ. 17,144 కోట్లు ఖర్చు అవుతుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేంద్ర జలశక్తి శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయని, దీన్ని పరిశీలించి వెంటనే ఆమోదం తెలపాలని సీఎం కోరారు.
2014 నుంచి తెలంగాణకు ఏపీ జెన్ కో సరఫరా చేసిన విద్యుత్ బకాయిలు రూ. 7,230 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, ఈ బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలని విన్నపం.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర విభజన హామీలను అమలు చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఏపీలో 13 జిల్లాలను 36 జిల్లాలుగా విభజించామని... ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండేలా కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని.. కాలేజీల ఏర్పాటుకు సహకారం అందించాలని విన్నవించిన సీఎం.
విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 55 కి.మీ. మేర 6 లేన్ల రహదారికి సహకారం అందించాలని విన్నపం. విశాఖ - కర్నూలు హైస్పీడ్ కారిడార్ ను కడప మీదుగా బెంగళూరుకు పొడిగించాలని కోరిన జగన్. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలని విన్నపం.
రాయలసీమలో కడప - పులివెందుల - ముదిగుబ్బ - సత్యసాయి ప్రశాంతి నిలయం - హిందూపూర్ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరిన ముఖ్యమంత్రి జగన్.