RBI: కేవైసీ మోసాలపై ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్.. ఆ పనులు మాత్రం చేయొద్దంటూ వార్నింగ్
- ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్పిన ఆర్బీఐ
- ఫోన్ కాల్, ఎస్ఎంఎస్, ఈ- మెయిల్స్ ద్వారా సందేశాలు
- లింక్ ఓపెన్ చేశారంటే ఖాతాలోని సొమ్మంతా మాయం
ఇటీవలికాలంలో పెరిగిపోతున్న బ్యాంకింగ్ మోసాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. కేవైసీ అప్ డేట్ చేయాలనే పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకు ఖాతాదారులను అప్రమత్తం చేసేందుకు పలు సూచనలు చేసింది. సైబర్ నేరస్థుల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటూ గైడ్ లైన్స్ విడుదల చేసింది.
కేవైసీ ఫ్రాడ్ అంటే..
బ్యాంకు ఖాతాదారుడు తన వ్యక్తిగత వివరాలు, గుర్తింపును బ్యాంకుతో పంచుకోవడమే ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’. ఖాతా తెరిచినపుడు వ్యక్తిగత గుర్తింపు కార్డు, చిరునామా తదితర వివరాలు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే రూల్స్ కారణంగా మరోసారి ఈ వివరాలు సమర్పించాలంటూ బ్యాంకులు కోరే అవకాశం ఉంటుంది. కేవైసీ వివరాలు సమర్పించడంలో ఆలస్యం చేస్తే ఖాతాను తాత్కాలికంగా సీజ్ చేయొచ్చు. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు.
వివిధ మార్గాలలో ఖాతాదారుల వివరాలు తెలుసుకుని వల విసురుతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కేవైసీ వివరాలు సమర్పించకపోవడంతో మీ ఖాతాను సీజ్ చేస్తున్నామని బెదిరిస్తారు. వెంటనే కేవైసీ అప్ డేట్ చేసుకోకుంటే ఖాతా నిలిచిపోతుందంటూ అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. మీరు ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేసి వ్యక్తిగత వివరాలు లాగేస్తారు. లేదా ఫలానా యాప్ డౌన్ లోడ్ చేసుకుని కేవైసీ అప్ డేట్ చేయాలని తొందరపెడతారు. యాప్ డౌన్ లోడ్ చేశారంటే మీ ఖాతాలోని సొమ్మంతా మాయం అవుతుంది. ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా కూడా ఈ సందేశాలు పంపించి బోల్తా కొట్టిస్తున్నారు.
ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే..
కేవైసీ అప్ డేట్ గురించి ఎటువంటి ఫోన్ కాల్ వచ్చినా వెంటనే రియాక్ట్ కాకుండా నేరుగా మీ బ్యాంకును సంప్రదించాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఫోన్ లోనే కేవైసీ పూర్తిచేద్దామని అనుకోకుండా బ్యాంకు వరకూ వెళ్లి నిజమో కాదో తెలుసుకోవాలి. అవసరమైన గుర్తింపు పత్రాలతో బ్యాంకులోనే కేవైసీ అప్ డేట్ చేసుకోవడం ఉత్తమమని చెబుతోంది.
ఆన్ లైన్ లావాదేవీల విషయంలో..
ఆన్ లైన్ లావాదేవీలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. ఎల్లప్పుడూ మీ బ్యాంకు అధికారిక వెబ్ సైట్, యాప్ లలోనే లాగిన్ కావాలని సూచించింది. కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడేందుకు గూగుల్ లో కనిపించిన నెంబర్లకు కాకుండా బ్యాంకు అధికారిక వెబ్ సైట్ లోని నెంబర్లను కాంటాక్ట్ కావాలని చెప్పింది.
మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి..
ఆన్ లైన్ మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ సూచిస్తోంది. పోయిన సొమ్ము తక్కువే కదా అనో లేక మరే కారణంతోనో నిర్లక్ష్యంగా వదిలేయవద్దని హెచ్చరించింది. ఫిర్యాదు చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలు, ఇబ్బందులను ముందే అరికట్టవచ్చు.
లాగిన్ వివరాలు ఎవరికీ చెప్పొద్దు..
సాధారణంగా బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ మీ లాగిన్ వివరాలను అడగరు.. ఒకవేళ అడిగినా మీరు మాత్రం చెప్పొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పినా, నిజంగా బ్యాంకు సిబ్బందే ఫోన్ చేసినా సరే లాగిన్ వివరాలు చెప్పొద్దని తెలిపింది. ఆధార్ కార్డు, చిరునామా, ఇతరత్రా గుర్తింపు పత్రాలను ఎక్కడపడితే అక్కడ ఇచ్చారంటే వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించింది.
యాప్స్, వెబ్ సైట్ ల విషయంలో..
ధ్రువీకరించని మొబైల్ యాప్, అనధికారిక వెబ్ సైట్ లకు దూరంగా ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి వాటితో మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు చోరీ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎస్ఎంఎస్ ల రూపంలో వచ్చే లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని మరీ మరీ హెచ్చరించింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈమెయిల్ లింకులు, ఎస్ఎంఎస్ లను తెరవొద్దని సూచించింది.