Revanth Reddy: ఈ విషయం నన్ను కాదు.. జగ్గారెడ్డిని అడగండి: రేవంత్ రెడ్డి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గారెడ్డి చెపుతున్నారన్న రేవంత్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే కలుపుకుని వెళ్తామన్న సీఎం
- మేడిగడ్డపై విచారణ జరిపిస్తామని వెల్లడి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు తిరుగులేని రీతిలో ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు అన్ని విషయాల్లో సవాల్ విసురుతూ ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తే... తాము కూడా అంత కంటే ఎక్కువగా ప్రతిస్పందిస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈరోజు రేవంత్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గారెడ్డి అంటున్నారని... ఆ విషయం గురించి తాను మాట్లాడనని.. ఆ విషయం జగ్గారెడ్డినే అడగాలని చెప్పారు. తమ పాలన నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామంటే కలుపుకుని వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే కాకుండా... ప్రతిపక్షాలను కూడా అక్కడకు తీసుకెళ్తామని చెప్పారు.