robbers: పటాన్‌చెరులో హడలెత్తిస్తున్న దారి దోపిడీ దొంగలు
- మహిళలు, వృద్దులే టార్గెట్‌గా దోపిడీకి పాల్పడుతున్న వైనం
- ఒంటరిగా ప్రయాణించాలంటేనే వణికిపోతున్న జనాలు
- పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న బాధితులు
ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, వృద్దులే లక్ష్యంగా పటాన్‌చెరులో దారి దోపిడీ దొంగలు హడలెత్తిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఆటో డ్రైవర్ల మాటున కొందరు దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ప్రయాణికులను కొద్ది దూరం తీసుకెళ్లాక అకస్మాత్తుగా దోపిడీకి దిగుతున్నారు. మహిళల మెడలో బంగారు నగలను లాక్కొని పారిపోతున్నారు.
ఆదివారం రాత్రి ఇలాంటి ఘటనే మరొకటి నమోదయింది. ఇస్నాపూర్ క్రాస్ రోడ్ దగ్గర వడ్ల మనెమ్మ(60) అనే వృద్దురాలిని ఓ ఆటో డ్రైవర్ నమ్మించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను గుర్తించి పట్టుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడ్డ నిందితులను అమీన్ పూర్‌కు చెందిన జెరిపాటి యాదయ్య(29), బొంత కృష్ణ(24), బొంత రేణుక(22)లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. నిందితుల నుంచి బంగారు గొలుసుని స్వాధీనం చేసుకున్నామని, ఆటోని సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా నిందితులు చందానగర్, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్థులని వివరించారు. కాగా దోపిడీ భయాలతో ఒంటరిగా ప్రయాణించాలంటేనే జనాలు ఆందోళనకు గురవుతున్నారు.