Ravindra Jadeja: మూడవ టెస్టులో రవీంద్ర జడేజా ఆడతాడా?
- గాయం నుంచి కోలుకొని జట్టుకి అందుబాటులోకి వచ్చిన ఆల్ రౌండర్ జడ్డూ
- కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్‌కు సంక్లిష్టంగా మారిన తుది జట్టు ఎంపిక
- 15న రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య మొదలుకానున్న మూడవ టెస్టు
ఇంగ్లండ్, ఇండియా మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 15న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇప్పటికే రాజ్‌కోట్ చేరుకున్నాయి. దాదాపు పది రోజుల విరామం తర్వాత ఇరు జట్లు మ్యాచ్ ఆడబోతున్నాయి. కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ దూరమవ్వడం.. గాయాల నుంచి కోలుకుని పలువురు ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రాజ్‌కోట్ టెస్టులో భారత్ తుది జట్టు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వస్తాడా? లేదా? అనేది సందేహంగా మారింది. గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన ఈ ఆల్ రౌండర్ తిరిగి జట్టుతో కలిశాడు. అయితే ఫిట్‌గా ఉన్నాడా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఫిట్‌గా ఉంటే తుది జట్టులో చోటిస్తారా? లేదా? అనేది ఎదురుచూడాల్సి ఉంది. కాగా తుది జట్టు ఎంపిక కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు తలనొప్పిగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బ్యాటర్ల ఎంపిక విషయంలో రజత్ పటీదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్‌లలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో ఆడతారా? లేక ఇద్దరితోనే సరిపెడతారా? అనేది తేలాల్సి ఉంది. ఇక పేసర్ల విషయానికి వస్తే మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్‌లలో ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.