Janga Krishnamurthy: సొంత పార్టీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
- బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవన్న జంగా కృష్ణమూర్తి
- కీలక పదవులన్నీ ఒక సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయని విమర్శలు
- బీసీ నేతలకు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆవేదన
ఏపీలో ఎన్నికల వేడి పెరిగేకొద్దీ, అధికార పక్షం వైసీపీలో అసంతృప్తుల సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. తాజాగా, వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ బీసీ సెల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి వ్యతిరేక గళం వినిపించారు.
బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు ఏవి? అని ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని... బీసీలకు నామమాత్రం కూడా అధికారాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, వైసీపీలో సామాజిక న్యాయం కూడా అంతేనని జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
బీసీలు ఇవాళ పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైసీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.