Sonia Gandhi: రాజ్యసభకు సోనియా.. రాయ్‌బరేలి బరిలో ప్రియాంక గాంధీ!

Reports saying Sonia Gandhi to switch Rajya Sabha and Priyanka Poll Debut
  • ఆరోగ్యం దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల బరి నుంచి సోనియా తప్పుకుంటారంటూ రిపోర్టులు
  • రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయబోతున్నారంటున్న పార్టీ వర్గాలు
  • తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకను పోటీ చేయించాలని భావిస్తున్నారంటున్న కాంగ్రెస్ వర్గాలు
రణరంగాన్ని తలపించే లోక్‌సభ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తప్పుకోనున్నారా?.. ఆరోగ్య కారణాల రీత్యా రాజ్యసభకు వెళ్లనున్నారా?.. అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. తాను పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి తన కూతురు ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దించాలని సోనియా యోచిస్తున్నారంటూ హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం 77 ఏళ్ల వయసున్న సోనియాగాంధీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే హడావుడిగా ఉండే లోక్‌సభ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభకు వెళ్లడంపై అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ ఆరోగ్యం దృష్టా ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే ఆమెకు మొట్టమొదటి ఎన్నికల పోటీ కానుంది. 

సోనియా గాంధీ 2006 నుంచి రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హస్తం పార్టీ అత్యంత ఘోరంగా విఫలమైన 2019లో కూడా ఆమె రాయ్‌బరేలీలో గెలిచారు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీకి రాయ్‌బరేలీ సురక్షితమైన సీటు అని సోనియా గాంధీ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం 1950 నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. కుటుంబంలో ప్రియాంక గాంధీ తాత ఫిరోజ్ గాంధీ మొట్టమొదటి సారి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. 

నిజానికి ప్రియాంక గాంధీ పోటీపై చాలా సార్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఆమె పోటీ చేయలేదు. పోటీ చేస్తారని భావించినప్పటికీ 2019లోనూ ఇదే జరిగింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ప్రియాంక ఎన్నికల బరిలో నిలవలేదు. అయితే ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పునరుద్ధరణకు ఆమె ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తూర్పు విభాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. అయితే సానుకూల ఫలితాలు రాబట్టలేకపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించగా, రాష్ట్రంలో 2022లో యోగి ఆదిత్యనాథ్ తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ కూడా ఓడిపోవడం గమనార్హం. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Sonia Gandhi
Rajya Sabha
Priyanka Gandhi
Congress
Rahul Gandhi

More Telugu News