Gruhajyothi: తెలంగాణలో 'గృహజ్యోతి' దరఖాస్తుల పరిశీలన.. అర్హులను గుర్తించే పనిలో అధికారులు
- ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది
- 200 యూనిట్ల లోపు వాడుతున్న వారికి ఉచిత విద్యుత్
- ఈ నెల 15 లోగా వివరాల సేకరణ పూర్తి చేయాలని టార్గెట్
గృహజ్యోతి పథకం లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. అర్హుల వివరాలను ఈ నెల 15 లోగా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు. విద్యుత్ శాఖ సిబ్బంది లైన్ మెన్లు, బిల్లింగ్ సిబ్బంది ఇంటింటికీ వెళుతున్నారు. మీటర్ ఎవరి పేరుతో ఉంది.. నెలనెలా ఎన్ని యూనిట్లు వాడుతున్నారు.. ఆధార్ కార్డు, పాత రేషన్ కార్డుల వివరాలను ఐఆర్ మెషిన్ లో అప్ లోడ్ చేస్తున్నారు.
ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆ కాలమ్ ను వదిలేస్తున్నారు. అద్దెకున్న వారి వివరాలనూ సేకరిస్తున్నారు. జనవరి నెల బిల్లుల సేకరణకు వెళుతున్న సిబ్బంది పనిలో పనిగా గృహజ్యోతి దరఖాస్తుదారుల వివరాలనూ సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 15 లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్టు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.