Farmers Protest: ఢిల్లీలోకి బలవంతంగా చొరబడుతున్న రైతులపై చర్యలు తీసుకోండి.. సీజేఐకి ఎస్‌సీబీఏ అధ్యక్షుడి లేఖ
- రైతులు ఢిల్లీలోకి చొరబడితే జనజీవనం అస్తవ్యస్తమైపోతుందన్న అదిష్ అగర్వాల
- కోర్టులకు హాజరుకాని లాయర్లపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి
- రైతు ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా రైతులు ఆగకపోవడంతోనే లేఖ రాశానని వివరణ
ఢిల్లీలోకి బలవంతంగా చొరబడి పౌరుల రోజువారీ జీవనాన్ని భంగపరచడంతోపాటు న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న రైతులపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు అదిష్ అగర్వాల మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కోర్టులకు హాజరుకాని లాయర్ల విషయంలో చర్యలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని కూడా కోరారు.
రైతు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తుండడంతో తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందని అదిష్ పేర్కొన్నారు. కాగా, 2021, 2022లోనూ ఆందోళనకు దిగిన రైతులు కొన్ని నెలలపాటు ఢిల్లీకి దారితీసే మూడు సరిహద్దులను దిగ్బంధం చేశారు. సరిహద్దుల దిగ్బంధం కారణంగా మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రులకు వెళ్లాలనుకున్న పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అదిష్ అగర్వాల లేఖ రాశారు.