Google: మొబైల్ లో ఏఐ వాడుతున్నారా.. ఆ పని మాత్రం చేయొద్దంటున్న గూగుల్!
- వ్యక్తిగత వివరాలు ఛాట్ జీపీటీకి ఇవ్వొద్దంటూ వార్నింగ్
- గూగుల్ జెమినీ యాప్ లో కీలక సమాచారం టైప్ చేయొద్దని సూచన
- ఒక్కసారి ఎంటర్ చేస్తే మూడేళ్ల దాకా డిలీట్ కాదని వివరణ
మొబైల్ ఫోన్ లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగిస్తుంటే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది. ఇటీవల గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన ఏఐ జెమినీ యాప్ లో కీలకమైన, వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయొద్దని సూచించింది. మొబైల్ లో ఛాట్ జీపీటీ ఉపయోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు పలు కంపెనీలు ఏఐ యాప్ లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం తమ ఏఐ యాప్ జెమినీ పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన దశలో ఉందని తెలిపింది. ఈ యాప్ పరిశీలనలో బయటపడిన వివరాలను పరిశీలించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు ఓ వార్నింగ్ ఇష్యూ చేసింది.
మొబైల్ వినియోగదారుల కోసం తయారుచేసిన ఏఐ యాప్ లలో డేటా చాలా రోజుల పాటు ఉండిపోతుందని గూగుల్ పేర్కొంది. జెమినీ యాప్ లో అయితే మూడేళ్ల పాటు ఆ డేటా డిలీట్ కాదని తెలిపింది. యాప్ మొత్తాన్నీ డిలీట్ చేసినా సరే గతంలో మీరు నమోదు చేసిన వివరాలు తొలగిపోవని వివరించింది. దీనికి కారణం.. ఏఐని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చేసిన ఏర్పాట్లేనని వెల్లడించింది. జెమినీ యాప్ లో ఎంటర్ చేసే వివరాలను యాప్ మరోచోట స్టోర్ చేస్తుందని, దానితో యాప్ కు కానీ అప్పటి వరకు మీరు చేసిన చాటింగ్ కు కానీ లింక్ ఉండదని గూగుల్ తెలిపింది.
యాప్ నుంచి సేకరించిన సమాచారాన్ని మూడేళ్ల పాటు నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. అంతేకాదు, జెమినీ యాప్ లో కూడా దాదాపు 72 గంటల పాటు డేటా నిల్వ ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పింది. అంటే.. మీ చాటింగ్ పూర్తయిన తర్వాత మెసేజ్ లను డిలీట్ చేసినా సరే 72 గంటల వరకు ఆ డేటా మొత్తం స్టోరేజ్ లో ఉంటుందని గూగుల్ తెలిపింది. ఈ క్రమంలోనే తన వినియోగదారులకు డేటా వాడకంపై గూగుల్ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది.