Revanth Reddy: తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్ రెడ్డి
- ప్రాజెక్టు కోసం రూ.97వేల కోట్ల వ్యయం చేసి కనీసం 97 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శ
- మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదు... పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్న సీఎం
- బీఆర్ఎస్, బీజేపీ నేతలు రావడం లేదన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుంచి బస్సులలో మేడిగడ్డకు బయలుదేరిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టు కోసం రూ.97వేల కోట్ల వ్యయం చేసి కనీసం 97 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ నోరు విప్పడం లేదని మండిపడ్డారు.
మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదు... పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలిపే ప్రయత్నమే ప్రజాప్రతినిధుల ఈ మేడిగడ్డ పర్యటన అన్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ఈ పర్యటనకు ఆహ్వానించామన్నారు. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదన్నారు.
కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు... వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మరోవైపు ఉన్నాయని ఆరోపించారు. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందన్నారు.