Peddireddi Ramachandra Reddy: వారితో షర్మిల చేతులు కలపడం బాధాకరం.. జగన్ అంటేనే నిజం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- టీడీపీ అజెండా మేరకు షర్మిల పని చేస్తోందని పెద్దిరెడ్డి విమర్శ
- జగన్ వల్లే ఏపీకి ఎక్కువ సాగునీటి జలాలు వచ్చాయన్న పెద్దిరెడ్డి
- రాజ్యసభలో టీడీపీ ఖాళీ కాబోతోందని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేతులు కలపడం బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ అజెండా మేరకే షర్మిల పని చేస్తున్నారని విమర్శించారు. 2018కి ముందు 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్పించిందని ఆరోపించారు. ఈ ఓట్ల కారణంగా వైసీపీ కూడా కొన్ని స్థానాల్లో ఓడిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ వల్లే ఏపీకి ఎక్కువ సాగునీటి జలాలు వచ్చాయని పెద్దిరెడ్డి అన్నారు. జగన్ వల్ల ఏపీ రైతులకు జరిగిన మేలును తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర మంత్రులే చెపుతున్నారని... తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. జగన్ అంటేనే నిజం అని ప్రశంసించారు. రాజ్యసభలో టీడీపీ ఖాళీ కాబోతోందని ఆ పార్టీ పతనావస్థకు ఇదే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిందో కూడా చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు. రాప్తాడు సిద్ధం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.