Srimanthudu: 'శ్రీమంతుడు' నా కథకు కాపీ అని అప్పుడే తెలిసింది: రచయిత శరత్ చంద్ర
- కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు'
- 2015లో విడుదలై విజయం సాధించిన సినిమా
- అది తన కథకు కాపీ అన్న శరత్ చంద్ర
- కొరటాల పెద్దగా స్పందించలేదని వెల్లడి
కొరటాల శివ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'శ్రీమంతుడు' సినిమా భారీ విజయాన్ని సాధించింది. 2015 ఆగస్టు 7వ తేదీన విడుదలైన ఈ సినిమా, మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన కథగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. అయితే ఈ కథ తనదంటూ అప్పట్లోనే రచయిత శరత్ చంద్ర మీడియా ముందుకు వచ్చారు.
అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం ముదురుతూ వచ్చింది. తాజాగా ఈ వివాదాన్ని గురించి 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ చంద్ర మాట్లాడారు. " నేను రాసుకున్న 'చచ్చేంత ప్రేమ' అనే కథ, 2012లో 'స్వాతి'లో పబ్లిష్ అయింది. వి. సముద్ర దర్శకత్వంలో నారా రోహిత్ తో ఈ కథను సినిమాగా చేయాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ సమయంలోనే 'శ్రీమంతుడు' సినిమా విడుదలైంది' అని అన్నారు.
'శ్రీమంతుడు' చూసిన నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి, అది నా కథ మాదిరిగానే ఉందని చెప్పాడు. అప్పుడు ఆ సినిమా చూసిన నాకు .. అది నా కథకి కాపీ అనే విషయం అర్థమైంది. ఆ విషయం గురించి నేను కొరటాల శివ గారికి కాల్ చేసి మాట్లాడాను. నేను రాసిన కథను ఒకసారి చదవమని ఆయనకి పంపించాను. ఆయన వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందువల్లనే కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది" అని చెప్పారు.