MS Dhoni: ధోనీ మా స్టిక్కర్ వేసుకుని మా నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు: 'బీఏఎస్' యజమాని
- 2019లో బీఏఎస్ కిట్ ఉపయోగించిన ధోనీ
- ధోనీ బ్యాట్ పై బీఏఎస్ స్టిక్కర్
- డబ్బు ఇస్తామన్నా ధోనీ ఒప్పుకోలేదన్న సోమీ కోహ్లీ
- కెరీర్ మొదట్లో సాయం చేసినందుకు ఇలా కృతజ్ఞత తెలిపాడని వెల్లడి
భారత్ లోని ప్రముఖ క్రీడా ఉపకరణాల తయారీ సంస్థల్లో బీఏఎస్ (BAS) ప్రముఖమైనది. ముఖ్యంగా క్రికెట్లో బీఏఎస్ కిట్లు పలువురు దేశ విదేశీ క్రికెటర్లు ఉపయోగిస్తుంటారు. ఇక, స్టార్ క్రికెటర్లు తమ అవసరాలకు తగినట్టు సొంత కిట్లను తయారు చేయించుకుంటారు. ఇలాంటి క్రికెట్ ఉపకరణాలపై ప్రముఖ సంస్థలు తమ స్టిక్కర్లు అంటించి ఆయా స్టార్ క్రికెటర్లకు భారీ మొత్తంలో నగదు చెల్లిస్తుంటాయి.
అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఇదే విధంగా బీఏఎస్ స్టిక్కర్ ను తన బ్యాట్ పై అంటించుకున్నప్పటికీ... ఆ సంస్థ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని బీఏఎస్ యజమాని సోమీ కోహ్లీ వెల్లడించారు.
"2019 వరల్డ్ కప్ సందర్భంగా ధోనీ తన బ్యాట్ పై మా స్టిక్కర్ వేసుకున్నాడు. కానీ, మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఎంతో కొంత తీసుకో ధోనీ అంటూ అతడ్ని బతిమాలాను... ధోనీకి మీరైనా చెప్పండి అంటూ అతడి తల్లిదండ్రులను, స్నేహితులను, ఆఖరికి ధోనీ భార్యను కూడా అడిగాను. కానీ ధోనీ డబ్బు తీసుకోలేదు. నా కెరీర్ తొలినాళ్లలో మీరు సహాయం చేశారు... అందుకు ఈ విధంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అని ధోనీ చెప్పాడు" అంటూ సోమీ కోహ్లీ వివరించారు.