Team India: టీ20 వరల్డ్ కప్ కోసం ఆటగాళ్లను కాస్త ముందుగానే న్యూయార్క్ పంపనున్న బీసీసీఐ
- జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్
- అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో వరల్డ్ కప్ పోటీలు
- మార్చి 22 నుంచి మే 26 వరకు భారత్ లో ఐపీఎల్
ఈ ఏడాది జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీమిండియా ఈ మెగా టోర్నీలో తన మొదటి మ్యాచ్ ను జూన్ 5న న్యూయార్క్ లో ఆడనుంది. అయితే, ఈ టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లను కాస్త ముందుగానే న్యూయార్క్ పంపాలని బీసీసీఐ భావిస్తోంది.
భారత్ లో మార్చి 22 నుంచి మే 26 వరకు ఐపీఎల్ జరగనుండగా, ప్లే ఆఫ్స్ కు చేరని జట్లలోని టీమిండియా ఆటగాళ్లను అమెరికా పంపించాలన్నది బోర్డు ప్రణాళిక. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీ ముగిశాక జట్టుతో కలుస్తారు.
2007 నుంచి టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తుండగా, ధోనీ నాయకత్వంలో ప్రారంభ టోర్నీ గెలవడం తప్పించి, ఇప్పటివరకు మరోసారి టీమిండియా టీ20 వరల్డ్ కప్ నెగ్గలేకపోయింది.
అయితే, ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిస్తున్న టీ20 టోర్నీ కోసం టీమిండియా ఎప్పటినుంచో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ పొట్టి ఫార్మాట్ కు తగిన ఆటగాళ్లను గుర్తించి సానబడుతోంది.