Ganta Srinivasa Rao: మీ వెన్నెముకలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి జగన్ గారూ!: గంటా
- అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కోరం లేక సభ వాయిదా
- వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారన్న గంటా
- గ్రూప్ ఫొటో లేకుండా సభా సమావేశాలు ముగియడం ఇదే తొలిసారి అని వెల్లడి
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పార్లమెంటు ఉభయ సభల్లోని మీ ఎంపీలు ఎందుకు మీకు ముఖం చాటేశారు? అని ప్రశ్నించారు.
ఇక్కడ రాష్ట్రంలో చివరి సభా సమావేశాల్లో మీ 151 మంది ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్సీలు కూడా అంతేనని పేర్కొన్నారు.
"జ్వరం వచ్చిందని 11 మంది, స్టమక్ అప్సెట్ అయిందని ముగ్గురు, బస్సు మిస్సయిందని ఎనిమిది మంది, కోర్టు వాయిదా ఉందని 28 మంది, ఇతర కారణాలతో ఇంకొంతమంది... ఇలా అద్భుత వ్యూహంతో మీ శాసనసభ్యులు దాదాపుగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు... సరైన కోరం లేక అసెంబ్లీ వాయిదా పడిన దుస్థితి ఏర్పడింది. మీ వెన్నెముకలు ఒక్కొక్కటిగా రాలి పడిపోతున్నాయి అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏమి కావాలి జగన్ మోహన్ రెడ్డి గారూ!" అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
"రాష్ట్ర చరిత్రలో ఓ టర్మ్ కు సంబంధించి చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రూప్ ఫొటో దిగకుండా వెళ్లిపోయిన దారుణమైన సందర్భం ఇది. తొలి నుంచి మీ మీద ఈగ వాలినా ఉవ్వెత్తున ఎగసిపడే నేతలకు మిగిలింది అనుమానపు చూపులు, అవమానపు మాటలే అని వారికి అర్థమైంది.
నమ్ముకున్న వారితోనే నట్టేట మునిగామని ప్రతి వైసీపీ నాయకుడు అంతర్మథనంలో పడిపోయాడు. ప్రతి వైసీపీ నేతకు తత్వం బోధపడిన సందర్భం ఇది. మునిగిపోతున్న వైసీపీ పడవ నుంచి ఒక్కొక్కరూ దూకేస్తున్నారు. సొంత పార్టీ నాయకులే మీ టికెట్ వద్దు, మీరు వద్దు అని ఛీ కొట్టి వెళ్లిపోతున్న సందర్భం ఇది.
మీరు అంటున్న 175కి 175 అనే మాట నుంచి ఇప్పుడు 1 లేదా 7 లేదా 5 అనే స్థాయికి పడిపోయిన క్షణం ఇదే అని గుర్తుంచుకోండి జగన్ మోహన్ రెడ్డి గారూ!" అంటూ గంటా ధ్వజమెత్తారు.