Padi Kaushik Reddy: నువ్వు ఓడిపోవాలని నీ భార్యే కోరుకుంది: పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
- 2018లో కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పొన్నం పోటీ చేసినప్పుడు ఓడిపోవాలని ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందా? లేదా? అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి
- అసెంబ్లీ ఎన్నికల్లో నా భార్యాబిడ్డలు నా గెలుపు కోసం పని చేశారన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే
- పొన్నంకు దమ్ముంటే సొంత నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని సవాల్
- గతంలో పొన్నంకు డిపాజిట్ కూడా దక్కలేదని విమర్శ
2018లో నీ భార్య నువ్వు ఓడిపోవాలని కోరుకుంటే... 2023లో నా భార్య, బిడ్డా నా గెలుపును కోరుకున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి... మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి అన్నారు. నీ చరిత్ర.. నా చరిత్ర రెండు నిమిషాల్లో చెబుతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ మీద, మాజీ మంత్రి కడియం శ్రీహరి మీద సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకర పదజాలం వాడారని ఆరోపించారు.
కాంగ్రెస్ సభ్యులు మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో తమకు అవకాశమివ్వలేదన్నారు. మీడియా పాయింట్ వద్ద కూడా తమను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను నా బిడ్డ, భార్య ప్రచారం చేస్తే గెలిచానని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. అవును... నేను గెలవాలని నా భార్యాబిడ్డలు కచ్చితంగా ప్రచారం చేశారు. కానీ నా చరిత్ర పొన్నం ప్రభాకర్ వంటిది కాదు. 2018లో కరీంనగర్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేసినప్పుడు... ఆయన ఓడిపోవాలని ఆయన భార్య ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది నిజమా? కాదా?' అని ఆయన ప్రశ్నించారు.
నా వైపు వేలు చూపించే ముందు నీ వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయని గుర్తుంచుకోవాలని సూచించారు. పొన్నం ప్రభాకర్ పదేపదే తన గురించి మాట్లాడుతున్నారని... నీలా నక్కలా కొట్లాడి తాను గెలవలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గర్జించి హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేశానన్నారు. ఈటల రాజేందర్‌ను ఓడించింది ఎవరు? అంటే కౌశిక్ రెడ్డి అనేలా చేశానన్నారు. కానీ నీలా నక్కలా... హుస్నాబాద్‌లో ప్రవీణ్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమైన తర్వాత ఆయన సీటును లాక్కొని పోటీ చేసి గెలిచావని పొన్నంపై మండిపడ్డారు. పొన్నంకు దమ్ముంటే తన సొంతూరు కరీంనగర్‌లో నిలబడి గెలవాల్సింది అన్నారు.
సొంత నియోజకవర్గంలో గెలవవు కాబట్టి పక్క నియోజకవర్గానికి వచ్చాడని పొన్నంపై విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం కరీంనగర్ నుంచి పోటీ చేస్తే 39వేల ఓట్లు వస్తే, తాను కాంగ్రెస్ నుంచి హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తే 62వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఆ తర్వాత 2019 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయావని... నీ సొంత నియోజకవర్గంలో 19వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. నీ ఇల్లు ఉండే నీ సొంత వార్డులో నీకు కేవలం 23 ఓట్లు మాత్రమే పడ్డాయని గుర్తుంచుకోవాలన్నారు. కానీ తన వార్డులో తనకు 1500 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నారు. ఇది నీ చరిత్ర.. నా చరిత్ర అన్నారు. 2018లో కరీంనగర్ ప్రజలు, నీ భార్య నువ్వు ఓడిపోవాలని కోరుకున్నారని పొన్నంను ఉద్దేశించి అన్నారు. కానీ తన నియోజకవర్గంలో తన భార్య, హుజూరాబాద్ ప్రజలు తన గెలుపును కోరుకున్నారన్నారు.