Revanth Reddy: పదేళ్లు ఈ ముఖ్యమంత్రి బాధ్యతల్లోనే ఉంటాను: రేవంత్ రెడ్డి
- నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దని... మీ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ
- సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఎంతగా సంతోషించానో... నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అంతే ఆనందం ఉందన్న సీఎం
- ఉద్యోగాలు పొందిన వారి కళ్లలో ఆనందం చూస్తేనే తనకు నిద్రపడుతుందన్న రేవంత్ రెడ్డి
- కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని ఓ అటెండర్ అన్నారని గుర్తు చేసుకున్న సీఎం
పదేళ్లు ఈ ముఖ్యమంత్రి బాధ్యతల్లోనే ఉండి ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పని చేస్తానని... మీరు ఆశీర్వదిస్తేనే మరో పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దని... మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఉద్యోగాలను సాధించడం ఆనందంగా ఉందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఎంతగా సంతోషించానో... ఇప్పుడు అంతే ఆనందం వేస్తోందన్నారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తామన్నారు.
తెలంగాణ వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారని... కానీ ఉద్యోగాలను భర్తీ చేయాలని గత ప్రభుత్వానికి పదేళ్ల పాటు ఆలోచన రాలేదని ఆరోపించారు. ఇప్పుడు తాము వచ్చాక అధికారులతో చర్చించి ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు తొలగించినట్లు తెలిపారు. నియామక పత్రాలను ఇంటికి పంపించవచ్చు కదా? అని హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారని... కానీ ఉద్యోగాలు పొందిన వారి కళ్లలో ఆనందం చూస్తేనే తనకు నిద్రపడుతుందని అందుకే ఇక్కడ ఇస్తున్నట్లు తెలిపారు. మీరంతా మాకు తమ్ముళ్లు... కాబట్టి మీ ఆనందాన్ని మేం పంచుకుంటామన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు పదవులు, ఉద్యోగాలు ఇస్తే మేం మాత్రం అందరికీ ఇస్తామన్నారు.
కేసీఆర్ శాసన సభకు రమ్మంటే రాలేదని... కానీ నల్గొండ వెళ్లి బీరాలు పలికారని విమర్శించారు. పాలిచ్చే బర్రెను ఇంటికి పంపించి దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ తమను ఉద్దేశించి అంటున్నారని... కానీ అసెంబ్లీలో ఓ అటెండర్ మరో రకంగా చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని సదరు అటెండర్ అన్నారని తెలిపారు. యువత కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నది... మీ కోసం పని చేయడానికి, మీ సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పదేళ్లు ఇదే బాధ్యతల్లో ఉండి ఇరవై నాలుగు గంటలు మీకోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. మీరు ఆశీర్వదిస్తే పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందన్నారు.