BAPS Hindu Mandir: గల్ఫ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
- అబుదాబిలో బీఏపీఎస్ హిందూ మందిర్ నిర్మాణం
- నేడు మోదీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం
- 27 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయ నిర్మాణం
- వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణం
అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం నేడు ప్రారంభమైంది. అబుదాబిలో బీఏపీఎస్ (బోచా సన్యాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్) సంస్థ నిర్మించిన హిందూ మందిర్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మోదీ ఆధ్వర్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఇది పశ్చిమ ఆసియాలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. 27 ఎకరాల్లో రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఈ హిందూ మందిర్ ను నిర్మించారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల ఎత్తుతో హిందూ మత చిహ్నాలతో, భారతీయ శిల్ప కళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ ఫలకాలపై రామాయణం, మహాభారతం, భాగవత, శివపురాణ గాథలను ముద్రించారు.
ఈ ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. ఆలయ స్తంభాలపై దేవతా ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి ప్రఖ్యాత రాజస్థాన్ పింక్ స్టోన్స్, ఇటలీ పాలరాయి వినియోగించారు. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా అబుదాబీలో ఈ ఆలయం నిర్మాణం జరుపుకుంది.
కాగా, సందర్శకులను ఆకట్టుకునే హిందూ మందిర్ ఆలయ ప్రాంగణంలో ఉద్యాన వనాలు, ఫుడ్ కోర్టులు, చిల్డ్రన్ స్పోర్ట్స్ ఎరీనాలు ఏర్పాటు చేశారు.