Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు కీలక మినహాయింపునిచ్చిన బీసీసీఐ!
- టీమిండియాలో లేని ఆటగాళ్ల కోసం బోర్డు కొత్త రూల్
- ఐపీఎల్ లో ఆడాలంటే ముందు రంజీల్లో ఆడాలని నిబంధన
- ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని తాజా ఆదేశాలు
- హార్దిక్ పాండ్యాకు ఈ నిబంధన వర్తించదన్న బోర్డు వర్గాలు
టీమిండియాలో లేని ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడాలంటే కొన్ని రంజీ మ్యాచ్ ల్లో ఆడాలని బీసీసీఐ కొత్త నిబంధనలకు రూపకల్పన చేస్తోంది. రంజీల్లో తమ రాష్ట్ర జట్లకు ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీసు మొదలుపెట్టిన ఇషాన్ కిషన్, దీపక్ చహర్, కృనాల్ పాండ్యా వంటి కొందరు ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ కు ముందు రంజీల్లో ఆడాలంటూ పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
అయితే, కీలక ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మాత్రం ఈ విషయంలో మినహాయింపునిచ్చారు. అతడికి బోర్డు నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలుస్తోంది. దీనిపై ఓ బీసీసీఐ అధికారి వివరణ ఇచ్చారు.
"హార్దిక్ పాండ్యా నాలుగు రోజులు, ఐదు రోజుల క్రికెట్ ఫార్మాట్లలో ఆడలేడు. అతడి శరీరం అందుకు సహకరించదని భావిస్తున్నాం. అయితే, ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు హార్దిక్ అవసరం ఎంతో ఉంది. అలాంటి ఆటగాళ్లకు తాజా నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది" అని తెలిపారు.