Kansas Shooting incident: అమెరికాలో కాల్పులు.. షూటర్‌ను అదుపులోకి తీసుకున్న సామాన్య ప్రజలు.. వీడియో ఇదిగో!

Kansas City Chiefs Fans Stop Gunman After Super Bowl Parade Shooting

  • కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు పరేడ్‌లో గురువారం కాల్పులతో కలకలం
  • పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
  • కాల్పులకు తెగబడ్డ ఓ నిందితుణ్ణి ధైర్యంగా అదుపులోకి తీసుకున్న సామాన్య ప్రజానీకం
  • ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్

అమెరికాలో ‘సూపర్ బౌల్’ టోర్నీ విజేత కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో గురువారం జరిగిన కాల్పుల ఉదంతం కలకలానికి దారితీసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా 21 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఘటన సమయంలో జట్టు ఫ్యాన్స్ కొందరు.. కాల్పులకు తెగబడ్డ నిందితుడిని ధైర్యంగా ఎదిరించారు. పారిపోతున్న అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు ఫ్యాన్స్ నిందితుడిని వెంబడించి మరీ పట్టుకున్నారు. అతడిని నేలపై పడదోసి ఎటూ కదలకుండా అష్టదిగ్భంధనం చేశారు. నిందితుడి వద్ద ఉన్న తుపాకిని ఓ మహిళ తీసుకోవడం కూడా వీడియోలో రికార్డయింది. 

ఈ ఘటనపై కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్పందించారు. ఈ ఉదంతం తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఆ వీడియోను తాము పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల వెనక కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన సమయంలో మిజోరీ గవర్నర్, ఆయన అర్ధాంగి కూడా పరేడ్‌కు హాజరయ్యారు. నిందితులు కాల్పులకు తెగబడగానే భద్రతా సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజా ఘటనతో ఈ ఏడాది అమెరికాలో మొత్తం కాల్పుల ఘటనలు 49కి చేరాయి.

  • Loading...

More Telugu News