Bandi Sanjay: కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి... అధికారులపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ డిమాండ్
- లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్న సంజయ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణ
- ఎన్నికల సమయంలో పొత్తు అంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తారని ఆగ్రహం
మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్నారు. గురువారం ఆయన సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు చాలా గ్రామాల్లో పర్యటించి ప్రజల ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. ఎక్కడకు వెళ్లినా ప్రజాస్పందన బాగా కనిపించిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉండాల్సిందే అని మాట్లాడుతున్నారని చెప్పారు. మోదీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇవ్వడంతో పాటు ఇటీవలే భవ్యమైన రామమందిరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాల కోసం కేంద్రం నుంచి నిధులు వస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయం చెప్పలేదని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇచ్చిన ఉపాధి హామీ నిధులు సహా ఎన్నో పథకాలకు సంబంధించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం ఏడు సంక్షేమ పథకాల కోసమే రూ.1400 కోట్లకు పైగా ఇచ్చినట్లు చెప్పారు. ఇతర పథకాల కోసం మరిన్ని నిధులు వచ్చాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెట్ల పెంపకం కోసం రూ.266 కోట్లు ఇస్తే వాటిని దారి మళ్లించారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భూదాన్ భూముల సంగతి బయట పెడతానని తెలిపారు. తనను గెలికితే అంతకుమించి గెలుకుతానని హెచ్చరించారు. కనీసం తన గ్రామ సర్పంచ్‌లతో సమావేశం పెట్టే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా? అని ప్రశ్నించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో కరీంనగర్‌ను గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ శాసన సభా వేదికగా ప్రశ్నించలేకపోతోందన్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చాక ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కానీ ఈ గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ మేడిగడ్డ పేరుతో, బీఆర్ఎస్ కృష్ణా జలాల పేరుతో డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది మేడిగడ్డ కుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి తనిఖీలు చేసిందని... నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు కూడా సంధించిందని గుర్తు చేశారు. మేడిగడ్డలో నీళ్లు నిలువచేసే పరిస్థితి లేదని... ఒకవేళ నిలిచినా అది ప్రమాదమేనని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మేడిగడ్డ కుంగుబాటుపై కొన్ని వివరాలు కావాలని కేంద్రం అడిగిందని... కానీ కాంగ్రెస్ ఆ వివరాలు అందించి విచారణకు సహకరించడం లేదన్నారు. దీనిని బట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అర్థమవుతోందన్నారు. కేంద్రం అడిగిన వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది... ఇది ఎందుకూ ఉపయోగపడదని తేలిన తర్వాత మళ్లీ నివేదిక ఏమిటి? ఇంకా విచారణ ఏమిటి? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవేమీ చేయకుండా నివేదికలు రాలేదని చెప్పడే ఏమిటి? అన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఘనవిజయం సాధించే అవకాశాలు ఉన్నందునే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. నివేదికలు వచ్చాక కూడా చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఈ రెండు పార్టీలు అనవసర చర్చతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో దుష్ప్రచారం
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అనే ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీకి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా అయిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి పొత్తుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 400 స్థానాలు గెలుచుకుంటుందని... అలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీతో మాకు పొత్తు ఎందుకు? అసలు అలాంటి అవసరమే లేదన్నారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మూడోస్థానానికి పడిపోయే బీఆర్ఎస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేది లేదన్నారు.