Anil Kumar Yadav: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్తున్న కాంగ్రెస్ యువనేత అనిల్ కుమార్ యాదవ్ గురించి కొన్ని వివరాలు...!
- మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడే అనిల్
- ఉస్మానియా యూనివర్శిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన యువనేత
- ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్
- 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన వైనం
- సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న తరుణంలో.. దక్కిన రాజ్యసభ అవకాశం
తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు నేతలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లు రాజ్యసభకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలిగా, ఫైర్ బ్రాండ్ గా రేణుక అందరికీ సుపరిచితమే. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ లో ఎంతో మంది కీలక నేతలు ఉండగా అనిల్ కుమార్ యాదవ్ కు పార్టీ హైకమాండ్ అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనిల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడే అనిల్ కుమార్ యాదవ్. 2013లో ఉస్మానియా యూనివర్శిటీ నుంచి అనిల్ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఆయన కాంగ్రెస్ తో కలిసి అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
2018 ఎన్నికల్లో ముషీరాబాద్ శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అనిల్... బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే, ఊహించని విధంగా ఆయనకు రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని హైకమాండ్ కల్పించింది.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ... తనకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. కష్టపడే వారికి కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయని చెప్పుకోవడానికి తానే ఉదాహరణ అని అన్నారు. యువకుడినైన తనకు... పెద్దల సభకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.