Nara Lokesh: మంచి చేస్తే ఉత్తరాంధ్రవారు ప్రాణాలిస్తారు... చెడు చేస్తే పాతరేసే శక్తీ ఉంది: నారా లోకేశ్
- దొంగ ఓట్లతో గెలిచేందుకు చూస్తున్నారని ఆరోపణ
- జగన్‌ను గెలిపించేందుకు తల్లీ, చెల్లి ఊరూరా తిరిగారని గుర్తు చేసిన లోకేశ్
- రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుకుంటున్నారని ఆగ్రహం
- చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న తనకు ఫోన్ చేశారన్న లోకేశ్
ఎవరైనా మంచి చేస్తే ఉత్తరాంధ్ర వారు వారి కోసం ప్రాణాలు ఇస్తారని... అదే సమయంలో మీకు చెడు చేస్తే పాతరేసే శక్తి కూడా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఎచ్చెర్ల శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ సభ చూస్తే తనకు ఉత్తరాంధ్ర గర్జించిందని అర్థమైందన్నారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర అని... ఇక్కడి జోష్ చూసిన తర్వాత 2024లో ఫ్యాన్‌కు కరెంట్ షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయమన్నారు.
'గరిమెళ్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రన్నాయుడు గారు వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల. అంత గొప్ప భూమిపై మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా.' అన్నారు.
దొంగ ఓట్లతో గెలిచేందుకు చూస్తున్నారు
జగన్ 420, ఎన్నికల అఫిడవిట్ చూస్తే 28 కేసులు ఉన్నాయన్నారు. జగన్ 420 అయితే, సజ్జల 840 అని ఎద్దేవా చేశారు. సజ్జల పేరుకే సలహాదారు... ఇచ్చేవన్నీ పనికిమాలిన సలహాలు అని మండిపడ్డారు. ఆంధ్రా ఖజానా నుంచి సలహాదారుల పేరుతో రూ.150 కోట్లు కొట్టేశారని మండిపడ్డారు. ఈ రోజు ఏకంగా రెండు ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఒక ఓటు తన మంగళగిరి నియోజకవర్గంలో, రెండో ఓటు పొన్నూరు నియోజకవర్గంలో ఉందన్నారు. అప్పుడు తనకు దొంగ ఓట్లతో గెలిచేందుకు చూస్తున్నట్లుగా అర్థమైందన్నారు.
'ప్రభుత్వ సలహాదారే దొంగ ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలిచారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆనాడే చెప్పా. అక్రమాలకు పాల్పడిన ఓ ఐఏఎస్ ను, డీఎస్పీ, సీఐలను, ఎస్ఐలను ఈసీ సస్పెండ్ చేసింది. రేపోమాపో మరికొందరిపై చర్యలు తీసుకుంటారు. ఎందుకు అధికారులు నా రెడ్ బుక్‌లో ఎక్కాలనుకుంటారు? చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎవరినీ వదిలిపెట్టను.' అని హెచ్చరించారు.
మొన్నీ మధ్య నలుగురు కుర్రోళ్లు తనను కలిసి మీకు, జగన్‌కు తేడా ఏమిటి? అని అడిగారని... తాను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకుంటే జగన్ రెడ్డి... రాజరెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్నారని సమాధానం చెప్పానన్నారు. తాను జనంలో తిరిగే వ్యక్తిని అయితే జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి అని, తాను స్టాన్‌ఫోర్ట్‌లో ఎంబీయే చదివితే జగన్ టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి అని, తనకు క్లాస్ మేట్స్ ఉంటే... జగన్ కు జైలుమేట్స్ ఉన్నారని సమాధానం చెప్పానని ఎద్దేవా చేశారు.
ఎంత అద్భుతమైన కేబినెట్ అని చురక
జగన్ కేబినెట్‌కి కొత్త అవార్డు వచ్చిందని... అదే దేశంలోనే పనికిమాలిన కేబినెట్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సీఎంకు, మంత్రులకు ఏమాత్రం అహగాహన లేదని... వారికి కేటాయించింది ఏ శాఖనో కూడా తెలియదన్నారు. ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు మన ఆర్థికమంత్రి బుగ్గన, ఇసుక, గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యం అమ్మడంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, పిల్ల కాలువలు తవ్వలేని అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి అని విమర్శించారు.
సొంత ఊళ్లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి, పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, గతంలో సన్నబియ్యం ఇవ్వమంటే ఇవ్వలేని సన్నాసి కొడాలి నాని, విశాఖలో ఓ మంత్రి ఉన్నాడు... పరిశ్రమలు ఎప్పుడు తీసుకువస్తారంటే కోడి ముందు వచ్చిందా? గుడ్డు వచ్చిందా? అని చెప్పే కోడిగుడ్డు మంత్రి అయిన పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్ నాథ్... పిల్లలు బాగా చదవకపోవడం వల్లే ఉద్యోగాలు రాలేదన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు... ఎంత అద్భుతమైన కేబినెట్ అని నిప్పులు చెరిగారు.
జగన్ రెడ్డి కొత్త పథకం తీసుకువచ్చారని... అదే స్విమ్మింగ్ ఫూల్ పథకమన్నారు. మన సీఎం ముందు చూపువల్లే ప్రతి గ్రామంలో, పట్టణంలో స్విమ్మింగ్ ఫూల్స్ ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్ అన్నారు. వర్షం పడితే మనం ఈత కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. రోజుకు వందలాది మంది రోడ్లపై పడి చనిపోతున్నారని, కనీసం 10 కి.మీ కూడా రోడ్డుపై జగన్ ప్రయాణించడం లేడన్నారు. 3 కిలో మీటర్లు వెళ్లాలన్నా హెలికాప్టరే అన్నారు. ఈమధ్య ఊరూరా తిరుగుతుంటే మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు కనిపిస్తున్నాయని... సొంత తల్లి, చెల్లే నిన్ను నమ్మడం లేదు.. మేమెలా నమ్మాలని జనం అంటున్నారని వ్యాఖ్యానించారు.
జగన్‌ను గెలిపించేందుకు తల్లీ, చెల్లి ఊరూరా తిరిగారు
ఎన్నికల ముందు జగన్ రెడ్డిని గెలిపించేందుకు తల్లీ, చెల్లి ఊరూరా తిరిగితే.. ఎన్నికల తర్వాత వారిని గెంటేశారని ఆరోపించారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడా? అని మహిళలను అడుగుతున్నానన్నారు. వైసీపీ పేటీఎం కుక్కలు జగన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలను సోషల్ మీడియాలో తిడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని... రెండు నెలలు ఓపిక పడితే మిమ్మల్ని వెంటాడతాం... వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
'జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న రెడ్ బటన్ తో వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడేబాదుడు, ఇంటిపన్ను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బాదుడే బాదుడు. బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్‌తో లిక్కర్ రేట్లు పెంచి బాదుడే బాదుడు. నిత్యావసరాల ధరలు పెంచి బాదుడే బాదుడు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్.. ఇలా దేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి' అని మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం...
ప్రజలు పడుతున్న కష్టాలు పాదయాత్రలో చూశానని... ప్రజల కష్టాలు తీర్చేందుకే బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ప్రతి ఏడాది డీఎస్సీ భర్తీ చేస్తామని.... 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుందని... ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుందన్నారు.
రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నామన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.
రాజధాని పేరుతో మూడు ముక్కలాట
'ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ రెడ్డి. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు మూడు కుటుంబాలకు లైసెన్స్ ఇచ్చారు. మొదటి కుటుంబం బొత్స, రెండో కుటుంబం విజయ సాయిరెడ్డి, మూడో కుటుంబం పేరు వైవీ సుబ్బారెడ్డి. వీరంతా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎక్కడ భూమి, చెరువు కనిపించినా కబ్జా చేస్తున్నారు. ఏదైనా భవనం బాగుందంటే వారి సొంత పేర్లపై మార్చుకుంటున్నారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు పిలుపునిస్తున్నా.. ప్రజలను దోచుకుతింటున్న ఈ మూడు కుటుంబాలను తరిమితరిమి కొట్టాలి. మా చిత్తూరులో కూడా పాపాల పెద్దిరెడ్డి కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి ఎంత అహంకారం అంటే.. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎచ్చెర్లకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఏకంగా రణస్థలం నుంచి తిరుపతికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే పుంగనూరు నియోజకవర్గంలో ఆపి ఎలా వస్తావు? అని అవమానించారు. ఆ పాపాల పెద్దిరెడ్డికి రెండు నెలల్లో వడ్డీతో సహా చెల్లిస్తా. బీసీ సోదరులంటే అంత చిన్న చూపా నీకు? బీసీ సోదరులు నీ వెన్నెముక విరిచే రోజు వస్తుంది' అని దుయ్యబట్టారు.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు... కానీ ఇప్పుడు జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రకు జగన్ అనేక హామీలు ఇచ్చారు... పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు... వంశధార, తోటపల్లి లెఫ్ట్, రైట్ కెనాల్స్ ను, నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు... కానీ కనీసం తట్టమట్టి వేయలేదన్నారు.
ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి ఎంతో ప్రేమ అని, రోడ్లు, బ్రిడ్జిలు, హాస్పిటల్స్, నిరుపేదలకు టిడ్కో ఇళ్లు కట్టించింది తెలుగుదేశమే అన్నారు. వంశధార-నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఎచ్చెర్లకు చాలా ఘన చరిత్ర ఉందని, ఆనాడు ప్రతిభా భారతి గారిని ఐదుసార్లు గెలిపించి ఏకంగా ఏపీ మొదటి దళిత స్పీకర్‌గా పంపిన నియోజకవర్గం ఇదేనని... అంత అద్భుతమైన గౌరవం ఇచ్చామన్నారు.
కళా వెంకట్రావు అభివృద్ధి చేశారు
2014లో మంచి మెజార్టీతో కళా వెంకట్రావు గారిని గెలిపిస్తే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. తోటపల్లి, నారాయణపురం ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు. సీసీ రోడ్లు, నిరుపేదలకు ఇళ్లు, బీటీ రోడ్లు వేశామని... రాజీవ్ గాంధీ యూనివర్సిటీగాని, పైడిభీమవరం ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేసిన వ్యక్తి కళా వెంకట్రావు అన్నారు. కానీ గత ఎన్నికల్లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు.
ఇక్కడ గొర్లె కిరణ్ గారిని గెలిపిస్తే ఏమైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఒక్క రోడ్డు కూడా వేయలేదు... అభివృద్ధికి కేంద్రంగా ఉన్న ఎచ్చెర్లను అవినీతి కేంద్రంగా చేశారని ఆరోపించారు. కేట్ కట్ చేసినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం ఇచ్చి దోచుకోమన్నారని మండిపడ్డారు.
'ఒక్క ఇసుకలోనే రూ.50 కోట్లు దోచుకున్నారు. 4 కొండలు మింగేశారు. గ్రావెల్ అమ్మి 75 కోట్లు సంపాదించారు. సొంత ఊరిలో ఉన్న భూముల్లో కూడా నకిలీ పత్రాలు సృష్టించి దోచేశారు. ఆ గ్రామస్తులు రెండు నెలలు ఓపిక పడితే విచారించి ఆ భూములు తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటా. అంగన్ వాడీ, ఆశావర్కర్ల పోస్టులు, చివరకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారు' అన్నారు.
వైకాపా నాయకులు సొంత నేతలను కూడా హత్యచేసే స్థితికి వచ్చారని... ఎమ్మెల్యే, ఎంపీపీ కలిసి ఏకంగా వాళ్ల వైస్ ఎంపీపీ శంకర్‌ను చంపేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన ఆసుపత్రిలో ఉన్నారన్నారు. వైసీపీ నాయకులు సొంత వ్యక్తులను చంపేందుకు కూడా వెనుకాడటం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే మొదటి ఏడాదిలో తోటపల్లి పెండింగ్ కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎచ్చెర్లలో ఐఐఐటీకి 200 ఎకరాలు కేటాయించామని... ఆ పనులు కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో స్టేడియం కడతామని, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, బూరగట్లపాలెం దగ్గర ఆనాడు జెట్టీ కట్టేదానికి డబ్బులు కూడా కేటాయించామని చెప్పారని... కానీ ఇప్పుడు పనులు ఆగిపోయాయన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వీటిని పూర్తి చేస్తామన్నారు.
'మత్య్సకారులకు వలలు, బోట్లు ఇచ్చాం. ఐస్ బాక్స్ లు అందజేశాం. వేట నిషేధం సమయంలో పెన్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు అనేక సబ్సీడీలు రద్దు చేశారు. అవన్నీ అమలు చేస్తాం. నిరుద్యోగ యువతీ యువకులకు హామీ ఇస్తున్నా... అనంత కియా మాదిరిగా ఉత్తరాంధ్రకు పెద్ద పరిశ్రమ తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటా. ఇప్పుడున్న సెజ్ కంటే పెద్దది కడతాం. స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. టీడీపీ కార్యకర్తల పార్టీ. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు లేకపోయినా 60 లక్షల మంది కార్యకర్తలను అన్న ఎన్టీఆర్ ఇచ్చారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వంద కోట్లు ఖర్చు చేయడం జరిగింది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాల పిల్లలను దత్తత తీసుకుని మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు. అది కార్యకర్తల పట్ల మాకున్న ప్రేమ' అన్నారు.
నాపై 22 కేసులు ఉన్నాయి
మనపై ఇప్పటివరకు అనేక కేసులు పెట్టారన్నారు. తనపై 22 కేసులు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారని... అయినా ఈ లోకేశ్ తగ్గేదే లేదన్నారు. బాంబులకే భయపడలేదన్నారు. నువ్వు పెట్టే చిల్లర కేసులకు భయపడతామా? మై డియర్ జగన్.. భయం మా బయోడేటాలోనే లేదు బ్రదర్ అని హెచ్చరించారు.
అన్న ఎన్టీఆర్ మనకు దేవుడు, చంద్రబాబు రాముడు అని పోల్చి చెప్పారు. వైకాపా కార్యకర్తలకు నేను మూర్ఖుడిని అని... చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విచారించి జైలుకు పంపిస్తామన్నారు. ఎర్రబుక్ చూస్తే వాళ్లకు ఉచ్చపడుతోందన్నారు. అందుకే కోర్టుకు వెళ్లి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పిటిషన్ వేశారన్నారు. ఎచ్చెర్లలోనే ఉన్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండని సవాల్ చేశారు. నేనెప్పుడు పరదాలు కట్టుకుని తిరగలేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే అవినీతిపై చర్చకు సిద్ధమన్నారు.
ఆ సమయంలో పవన్ అన్న నాకు ఫోన్ చేశారు
చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్‌కు పంపిస్తే తనకు మొదట ఫోన్ చేసింది పవన్ కల్యాణ్ అన్న అని తెలిపారు. మీకు అండగా నిలబడతానని, ధైర్యంగా ఉండాలని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి ఈ ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3 గంటలు ఆపేశారని... అందుకే సైకో జగన్‌ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారన్నారు.
టీడీపీ-జనసేన మధ్య వైకాపా పేటియం బ్యాచ్ చిచ్చు పెడతారని... వాటన్నింటిని తిప్పికొట్టాలని సూచించారు. కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. బూత్‌లో బాగా పనిచేసే వారికి, టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సైకోలను తిప్పికొట్టేందుకు టీడీపీ-జనసేన కార్యకర్తలు కలసికట్టుగా కృషిచేయాలన్నారు.
యువనేత నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విజయనగరం జిల్లా
16-2-2024 (శుక్రవారం) కార్యక్రమ వివరాలు
నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం 10.15 - విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
10.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32– నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త లోకం నాగ మాధవి ప్రసంగం.
10.34– నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు ప్రసంగం.
10.36– నెల్లిమర్ల శంఖారావం సభలో యువనేత లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా బాబు సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.05 – యువనేత నారా లోకేశ్ విజయనగరం చేరిక.
12.45 – విజయనగరం పట్టణంలో భోజన విరామం.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15 – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
2.20 – ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
2.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.32– విజయనగరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పాలవలస యశస్వి ప్రసంగం.
2.34– విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ అదితి గజపతిరాజు ప్రసంగం.
2.36– విజయనగరం శంఖారావం సభలో యువనేత లోకేశ్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో యువనేత లోకేశ్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేశ్ సెల్ఫీ.
4.00 – యువనేత గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
గజపతినగరం నియోజకవర్గం
సాయంత్రం
4.45 – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
4.50 – ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.02 – గజపతినగరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఎం.సురేశ్ ప్రసంగం.
5.04 – గజపతినగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ కొండపల్లి అప్పలనాయుడు ప్రసంగం.
5.06 – గజపతినగరం శంఖారావంలో యువనేత నారా లోకేశ్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేశ్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టీడీపీ కార్యకర్తలచే యువనేత లోకేశ్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా శృంగవరపుకోట ప్రయాణం.
6.50 – శృంగవరపుకోట చేరుకుని, అక్కడ బస చేస్తారు.