Rajasthan: 16 ఏళ్ల బాలికపై నీట్ విద్యార్థుల అత్యాచారం!
- రాజస్థాన్‌లోని కోటాలో దారుణం
- నిందితుడితో బాలికకు సోషల్ మీడియాలో పరిచయం
- బాలికను తన గదికి రప్పించి మరో ముగ్గురి సాయంతో అత్యాచారం
- నిందితులపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు, అరెస్ట్
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న 16 ఏళ్ల బాలికపై మరో నలుగురు నీట్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. కోటాలో ఫిబ్రవరి 10న ఈ దారుణం జరగ్గా నిందితులను పోలీసులు ఫిబ్రవరి 15న అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు మూడు రోజులుగా బాధితురాలు డిప్రెషన్లో ఉండటం గమనించిన ఆమె స్నేహితులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో ఆమె జరిగిన దారుణాన్ని వెల్లడించింది. కోటాలోనే చదువుకుంటున్న మరో నీట్ అభ్యర్థి బాధితురాలికి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. ఘటన జరిగిన రోజున ఏదో కారణంతో ఆమెను తన గదికి రప్పించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణంలో అతడి ముగ్గురు స్నేహితులు సహకరించినట్టు పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్యాంగ్ రేప్ నేరంపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. నిందితులందరూ స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు. నిందితుల్లో ఒకరిది పశ్చిమ బెంగాల్ కాగా మిగిలిన వారు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.