Delhi Factory: ఢిల్లీ ఫ్యాక్టరీలో ఎగిసిపడ్డ మంటలు.. 11 మంది ఆహుతి.. వీడియో ఇదిగో!
- శివార్లలోని పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
- పక్కనే ఉన్న గోడౌన్లకు వ్యాపించిన మంటలు
- ఓ కానిస్టేబుల్ సహా నలుగురికి గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నగర శివార్లలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం మంటలు ఎగిసిపడ్డాయి. కాస్త వ్యవధిలోనే చుట్టుపక్కల ఉన్న గోడౌన్లకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో పదకొండు మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి. మొత్తం 22 ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు.
గురువారం రాత్రి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించగా.. శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
ఆలిపూర్ లోని దయాల్ పూర్ మార్కెట్ ఏరియాలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.